Andhrapradesh Rains News Updates అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఈ తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తీవ్రరూపం దాల్చి మిచాంగ్‌ తుపానుగా మారింది. ఈ తుపాను డిసెంబర్ 5వ తేదీన నెల్లూరు - కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచాంగ్ తుపాను తీవ్రత దృష్ట్యా ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు, లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.


నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం ఉదయం అదే ప్రాంతంలో 10.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం 83.6 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద తుపాను కేంద్రీకృతమై ఉంది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 440 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు ఆగ్నేయంగా 580 కి.మీ దూరంలో, బాపట్లకు ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు దూరంలో ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నైరుతి బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో తుఫాన్ గా బలపడే అవకాశం ఉంది. వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు డిసెంబర్ 4వ తేదీన విస్తరిస్తుంది. అనంతరం ఉత్తర దిశగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ప్రయాణిస్తూ, నెల్లూరు - మచిలీపట్నం మధ్య 5వ తేదీన ఉదయానికి తుఫాన్ తీరం దాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో గంటలకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 


తిరుపతి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు జిల్లాకు సైతం భారీ వర్ష సూచన ఉందని స్పష్టం చేసింది. డిసెంబర్ 3న చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. కోస్తాంధ్రలోని ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. వైఎస్సార్ జిల్లా, నంద్యాల, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడతాయి. గంటలకు 50 నుంచి గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. 






కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్.. 
నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో తుపాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కలెక్టర్ హరి నారాయణన్. కంట్రోల్ రూమ్ లో 1077 కాల్ సెంటర్ 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమించామన్నారు. డివిజన్ కేంద్రాల్లో కూడా శనివారం ఉదయం నుంచి కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు తమ సిబ్బందికి ఎటువంటి సెలవులు ఇవ్వరాదని, ఎవరూ వారి డివిజన్ హెడ్ క్వార్టర్లు దాటి వెళ్లరాదని ఆదేశించారు. 


రాగల 4 రోజుల వాతావరణ సమాచారంపై విపత్తుల నిర్వహణ సంస్థ అప్ డేట్..


ఆదివారం(03-12-2023): శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


సోమవారం(04-12-2023): శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో  కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


మంగళవారం(05-12-2023): శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


బుధవారం(06-12-2023): శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.