Crime Rate: గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో నేరాలు  బాగా ఎక్కువగా నమోదు అయినట్టు శ్రీకాకుళం ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో 2022 ఏడాదిలో నమోదైన వివిధ కేసులు, అంశాలుపై వివరించారు. గతేడాదిలో 6,637 నేరాలు నమోదు కాగా ఈ ఏడాది 6,719 నమోదు అయినట్టు తెలిపారు. 2021 డిసెంబర్ నాటికి 4,265 పెండింగ్ కేసులతో కలుపుకొని ఈనెల 28 వరకు నమోదైన మొత్తం 10,984 కేసుల్లో 7,550 కేసులు విచారణ పూర్తి చేశామన్నారు. మిగతా 3,430 కేసులు పెండింగ్లో ఉన్నట్టు వివరించారు. లోక్ అదాలత్లో 3,523 కేసులను రాజీ మార్గం ద్వారా రాజీ కుదర్చ గలిగామన్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది 2922 కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడ్డాయన్నారు. జిల్లాలో దొంగతనాలు పెరిగాయన్నారు. 


2021లో 224 ఉండగా ఈ ఏడాది 247 కేసులు నమోదు కాగా అందులో 124 కేసుల్లో రికవరీ చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి నమోదైన కేసులు సంఖ్య 72 నుంచి 58కి తగ్గిందని తెలిపారు. సైబర్ క్రైం, చీటింగ్ కు సంబంధించి 121 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. గేమింగ్ యాక్ట్ కింద 203 కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 38 మందిపై రౌడీషీటర్ తెరిచామన్నారు. నాటు సారా, మధ్యం, నిషేదిత మత్తు పదార్థాలు రవాణా చేసినందుకు 2115 కేసులు నమోదు చేసి 1635 మందిని అదుపులోకి తీసుకొని 121 వాహనాలు సీజ్ చేసినట్టు వివరించారు. బందోబస్తు డ్యూటీలు నిర్వహిస్తు నేరాల నియంత్రణలో పోలీసు శాఖ 24 గంటలు పనిచేస్తుందన్నారు. మహిళలపై నేరాలు పెరిగాయన్నారు. మహిళా నేరాలకు సంభందించి ఈ ఏడాది 498 కింద కేసులు అధికంగా నమోదు చేసినట్టు తెలిపారు. 


మహిళా పోలీసుల సేవలను వినియోగించుకుంటూ గ్రామాల్లో చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. చిన్నపిల్లలపై లైంగిక వేదింపులకు సంబంధించి పోక్సోచట్టం కింద 43 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. 18 ఏళ్లలోపు బాలికలపై లైంగిక దాడులు సంఖ్య గణనీయంగా తగ్గాయన్నారు. ఈ ఏడాది 490 మిస్సింగ్ కేసులు నమోదు అయితే అందులో 390 కేసులు ఛేదించామన్నారు. దిశ యాప్ ద్వారా 20,158 కాల్స్ రాగా అందులో టెక్స్ కాల్స్ మినహాయించగా 438 రియల్ కాల్స్ వచ్చాయన్నారు. వీటిలో 34 ఫిర్యాదుల్లో కేసు నమోదు చేసినట్టు ఎస్పీ రాధిక తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దిశ యాప్ ను 10,45,695 మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. 1114 మంది స్పందనకు ఫిర్యాదు చేయగా 18 ఫిర్యాదులు మినహా మిగతా అన్నింటిని పరిష్కరించామన్నారు. సెల్ ఫోన్ లు పోయినట్లు ఆన్ లైన్ లో 440మంది ఫిర్యాదు చేయగా.. 165 రికవరీ చేసినట్టు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 994 సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా లక్ష్యాలను నిర్ధేశించి ఏర్పాటు చేయిస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేశామని వివరించారు. అందులో భాగంగా వాహనాలు తనిఖీలు నిర్వహించి, అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు స్పష్టం చేశారు. 


ఈ సంవత్సరం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సంఖ్య గణనీయంగా పెరిగాయని ఎస్పీ రాధిక చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో మృతులు సంఖ్య అధికంగా ఉందన్నారు. జాతీయ రహదారిపైన జరిగిన ప్రమాదాల్లో 111 మంది మృత్యవాత పడినట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు విజువల్ పోలీసింగ్, అపరాధ రుసము వసూలు, వేగ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనలను అతిక్రమించిన వాహన చోదకులపై 1,51,088 ఈ-చలానాలు విధించి రూ.3,85,20,820లు అపరాద రుసుం వేశామన్నారు. ఇందులో 43,656 ఈ చలానాలు నుంచి రూ. 1,16,49,045లు వసూలు చేశామన్నారు. ఈఏడాది కొత్తగా 11,136 వివిధ రకాల వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు తెలి పారు. రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవడంతోపాటు, అవగా హన కార్యాక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. పోలీస్ సంక్షే మానికి నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలు ఉంటాయన్నారు. కరోనా కోత్త వేరియంట్ విస్తరిస్తుందన్న కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలు నేపధ్యంలో ఎవరికి వారే స్వీయ నియంత్రన పాటించాలని కోరారు. సంక్రాంతి కారణంగా నగరంలో ట్రాఫిక్ అంక్షలు జీటీ రోడ్డులో అమలు చేస్తు న్నట్టు తెలిపారు. ప్రజలంతా పోలీసులకు సహకరించి సేవల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.