Etela Rajender : కేంద్రం ఇచ్చిన నిధులను సర్పంచులకు తెలవకుండా డ్రా చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. 12 వేల గ్రామాల్లో నిధులు లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే అవి పట్టించుకోకుండా ఇతర పార్టీల మీద ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వమని మీ మామను  కన్విన్స్ చేయి అంతే కానీ ఇతర పార్టీల మీద విరుచుకు పడితే మీ స్థాయి పెరగదని మంత్రి హరీశ్ రావుకు హితవు పలికారు ఈటల రాజేందర్.  ఫామ్ హౌజ్ లో ఉండే సీఎంను కలిసి కష్టాలు చెప్పుకొనే అవకాశం ఎవరికీ లేదన్నారు. దేశమంతా ఎస్ఐ సెలక్షన్ కోసం 3.8 మీటర్ల లాంగ్ జంప్ ఉంటే.. మన దగ్గర మాత్రం 4 మీటర్లు పెట్టారన్నారు. మిలటరీలో ఇతర రాష్ట్రాలలో లేని రూల్ తెలంగాణలో పెట్టి అభ్యర్థుల కళ్లల్లో మట్టికొట్టారన్నారు. అభ్యర్థులు వారి బాధ చెప్పుకుందాం అంటే కేసీఆర్ కలవరని, హోంమంత్రికి అధికారులు లేవని ఎద్దేవా చేశారు.  


మీకు వాత పెట్టడం ఖాయం 


" కేటీఆర్, హరీశ్ మీరు కలిపించుకొని ఎస్ఐ అభ్యర్థుల సమస్య పరిష్కరించాలి. లేదంటే సరైన సమయంలో మీకు వాత పెట్టడం ఖాయం.  ప్రజా ప్రతినిధులు బానిసలుగా మారకండి. స్థానిక సంస్థలు కోసం చట్టం తెస్తే ఆ చట్టాన్ని కేసీఆర్ చట్టుబండలు చేశారు. పోలీసు ఉద్యోగార్థులు తిరుగుబాటు చేయండి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కావు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ధరణి సమస్యలు తెచ్చినా, పెన్షన్లు ఆపినా ప్రజలు మౌనంగా భరిస్తున్నారు. వీటంన్నిటికీ మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. బానిసలుగా మారి మామీద అటాక్ చేసే కంటే, జపం చేసే కన్నా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మద్యం ఎంత అమ్ముతుంది అని రోజు వారీ సమీక్ష  చేస్తున్నారు. ఆ డబ్బులు రానిదే జీతాలు, పెన్షన్ లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. గ్రామాలు గంజాయికి అడ్డాగా మారాయి. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. మాదకద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు. మీ విధానం గురివింద నలుపులా ఉంది." - ఈటల రాజేందర్ 


కమీషన్ల కోసమే ప్రాజెక్టులు- ఎంపీ అర్వింద్


బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జగిత్యాల పట్టణంలోని బీఎల్ఎన్ గార్డెన్ లో  బీజేవైఎం జిల్లా శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. మొదటగా మోదీ తల్లి హీరాబెన్ కి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. తర్వాత అకాల వర్షాలకు దెబ్బతిన్న  బీర్పూర్ మండలం రోళ్ళావాగు ప్రాజెక్టు పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. రోళ్ల వాగు కట్ట తెగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో  మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం కేసీఆర్ పాలనకు నిదర్శనం అన్నారు. రూ. 60 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు రూ.130 కోట్లకు పెంచడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఓ పెద్ద గుంట నక్క అని...దేశాన్ని దోచుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆరోపించారు. యాసంగి పంటకు నీరు అందిస్తామన్న స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తర్వాత బీర్పూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల నుండే కాషాయ ఉద్యమం మొదలవుతుందని.. శివాజీ ఆశయాల స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.