Ambati Rayudu Responds on Exit From Ysrcp: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) శనివారం వైసీపీని వీడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించడం సంచలనం కలిగించింది. ఈ నిర్ణయం అటు రాజకీయ వర్గాలు, ఇటు వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. ఈ అంశంపై సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ సాగింది. అయితే, దీనిపై తాజాగా అంబటి రాయుడే స్వయంగా ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చారు. 'నేను ఈ నెల 20 నుంచి దుబాయ్ లో జరిగే ILt20లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. వృత్తిపరమైన గేమ్ అడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.' అంటూ వివరణ ఇచ్చారు. 






ఆ ఒక్క ట్వీట్


డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఈ నెల 6న (శనివారం) తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా' అంటూ ట్వీట్ చేయడంతో అంతా షాకయ్యారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు ఏమైందీ.? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారని.. అయితే అది కేటాయించకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారని వార్తలు హల్చల్ చేశాయి. ఆయనకు మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేయగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, టీడీపీ సైతం అంబటి రాజీనామాపై స్పందించింది. 'జగన్ వంటి దుర్మార్గుడితో కలిసి మీరు మీ రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్ ప్రయత్నాల్లో మీకు అంతా మంచే జరగాలని దేవుడిని కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేస్తూ అంబటి రాయుడు ట్వీట్ ను ట్యాగ్ చేసింది. అధినేత చంద్రబాబు సైతం ఆదివారం తిరువూరు సభలో మాట్లాడుతూ.. అంబటి రాయుడు అంశంపై స్పందించారు. గుంటూరు ఎంపీ టికెట్ పేరుతో మాజీ క్రికెటర్ అంబటి రాయుడును మోసగించారని, ఆ టికెట్ మరొకరికి ఇవ్వడంతో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రకటించారని అన్నారు. 


వైసీపీ నేతల స్పందన ఏంటంటే.?


అటు, అంబటి రాయుడు రాజీనామాపై స్పందించిన వైసీపీ నేతలు ఆయన్ను పార్టీలో చేరాలని ఎవరూ అడగలేదని.. ఆయనే ఒత్తిడి తెచ్చి మరీ వచ్చారని చెప్పారు. వైసీపీలోకి రాక ముందు వరకూ రాయుడు.. ఆ పార్టీ నేతలతో కలిసి గుంటూరు జిల్లాలో పర్యటించారు. సీఎం జగన్ కు మద్దతుగా ట్వీట్లు చేశారు. అంతా అనుకున్నట్లుగానే పార్టీలో చేరినా.. ఆ తర్వాత 10 రోజులకే వైదొలగుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేశారు. 


Also Read: Chandrababu: 'జగన్ రివర్స్ పాలనలో 30 ఏళ్లు వెనక్కు ఏపీ' - మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతిపై చంద్రబాబు కీలక హామీ