Cow Sitting Like Nandi Infront Of Sivayya: సోమవారం రోజును పరమశివునికి ఇష్టమైన రోజుగా చెబుతారు. సాధారణంగా ఈ రోజున శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ క్రమంలో అనంతపురం (Anantapuram) జిల్లాలో సోమవారం వింత ఘటన చోటు చేసుకుంది. పురాతన ఆలయంలో ఓ ఆవు గర్భగుడిలో శివయ్యకు ఎదురుగా నంది రూపంలో కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచింది. విడపనకల్లు మండలం పురాతన శివాలయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామంలోని రామలింగేశ్వర ఆలయంలో ఉదయం అర్చకులు యథావిధిగా శివయ్యను అభిషేకించి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు.


పూజ అనంతరం గ్రామంలోని ఒక ఆవు నేరుగా రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్దకు చేరుకుంది. భక్తులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా గర్భగుడిలోని శివలింగానికి ఎదురుగా వచ్చి నంది రూపంలో కూర్చుంది. దీంతో అర్చకులు, భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతోనే ఈ ఆవు ఇలా వచ్చి స్వామివారిని దర్శించుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామంలోని ఆలయంలో శివుడికి ఎదురుగా నంది రూపంలో ఆవు కూర్చుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


నీళ్లు తాగుతున్న అమ్మవారి విగ్రహం


మరోవైపు, వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం వైరల్‌గా మారింది. అన్నమయ్య (Annamayya District) జిల్లా పీలేరు పట్టణంలోని శివాలయం అర్చకులు కుమారస్వామి ఇంట్లో వారాహి అమ్మవారు పానకం తాగుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారాహి దేవీ నవరాత్రుల్లో భాగంగా అర్చకులు కుమారస్వామి సతీమణి లక్ష్మి అమ్మవారికి గత 8 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు, విశాఖలోని సింహాద్రిపురం విజయలక్ష్మి ఇంట్లో వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్నారంటూ సాగిన ప్రచారం సైతం వైరల్‌గా మారింది. ఇది నిజంగా అమ్మవారి మహిమే అంటూ స్థానికులు పేర్కొంటున్నారు.


Also Read: Tirumala News: తిరుమలలో భక్తులపై ఫ్రాంక్ వీడియోలు - క్షమాపణలు చెప్పిన యూట్యూబర్