Cars Washed Away With Flood In Hyderabad: తెలంగాణలోని పలు జిల్లాల్లో (Telangana) వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. అటు, హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నుంచి ఏకధాటిగా వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు జలమయమై వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు చేరగా ప్రజలు అవస్థలు పడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అయ్యింది. మారేడ్‌పల్లిలోని న్యూ మెట్టుగూడలో అత్యధికంగా 7.75 సెంటీమీటర్లు,  యూసఫ్‌గూడలో 7.65, జూబ్లీహిల్స్‌లో 7.2, శేరిలింగపల్లి, మాధాపూర్‌లో 6.95, నాచారం, సీతాఫల్‌మండిలో 6.85 సిటీ శివారుల్లో 5.20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాచుపల్లి, నిజాంపేట, కూకట్ పల్లి, ప్రగతినగర్, మాదాపూర్, కొండాపూర్, అమీర్ పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. జీడిమెట్ల, గాజులరామారం, ఖైరతాబాద్, మెహిదీపట్నం ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. 


నిండుకుండలా హుస్సేన్ సాగర్


భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటిమట్టం 514 అడుగులు కాగా.. ప్రస్తుతం 513 అడుగులకు నీరు చేరింది. దీంతో 2 గేట్లు ఎత్తిన సిబ్బంది నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. కూకట్పల్లి, బంజారా, బుల్కాపూర్ నాలాల నుంచి భారీగా వరద చేరుతోంది.


వరదలో కొట్టుకుపోయిన కారు


భారీ వర్షం కారణంగా కృష్ణానగర్‌లోని నిలిచి ఉన్న వాహనాలు కూడా నీళ్లతో కొట్టుకుపోయాయి. ఓ కారు వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, ముషీరాబాద్ పరిధి రాంనగర్ స్ట్రీట్ నెంబర్ 17లో ఆదివారం రాత్రి ఓ కారు వరదలో చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో నలుగురు అందులోనే చిక్కుకుపోయారు. ఇది గమనించిన నలుగురు యువకులు సాహసం చేసి కారును ఓ పక్కకు తెచ్చారు. అనంతరం కారు అద్దాలు పగలగొట్టి వారిని రక్షించారు. ఈ క్రమంలో యువకులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.


సహాయం కోసం..


భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది. వర్షానికి సంబంధించి సమస్యలు, సహాయం కోసం 040 - 21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.


జిల్లాల్లోనూ భారీ వర్షాలు 


తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా నీల్వాయిలో అత్యధికంగా 15.83 సెం.మీ వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా కాటారం 11.15, ఆదిలాబాద్ జిల్లా కుంచవెల్లి 11.08, భూపాలపల్లిలోని మహాదేవ్‌పూర్‌లో 11, కొయ్యూరులో 10.65, మంచిర్యాలలోని కోటపల్లిలో 9.48, వికారాబాద్‌లోని నవాబ్ పేటలో 8.48, షేక్ పేట 8.45, మారేడ్‌పల్లి 8.4, ఖైరతాబాద్‌లో 8.4, ముషీరాబాద్ 8.2, శేరిలింగంపల్లి 7.93 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.


Also Read: Road Accident: ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ప్రమాదం - కారు ఢీకొని ఎగిరిపడ్డాడు, షాకింగ్ వీడియో