Corona Cases Today In AP: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గత వారం చివర్లో తగ్గినట్లే కనిపించినా క్రమంగా పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోల్చితే దాదాపు 300 మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. గత నెలన్నర రోజులుగా 24 గంటల వ్యవధిలో దాదాపుగా వెయ్యికి పైగా కొవిడ్ కేసులు వస్తున్నాయి. నిన్నటితో పోల్చితే కొవిడ్ మరణాలు సైతం పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,445 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో మరో 11 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు. 


ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మంగళవారం నాటికి 2 మిలియన్లకు చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,30,524 పాజిటివ్ కేసులకు గాను 20,01,891 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు వరుసగా మూడో రోజు 15 వేల దిగువన ఉన్నాయి. అయితే నిన్నటితో పోల్చితే యాక్టివ్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 14,603 యాక్టివ్ కరోనా కేసులున్నాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Also Read: గర్భవతులు కాఫీ తాగొచ్చా? తాగితే ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డకు ఎంత ప్రమాదమో తెలుసా?






ఏపీలో కొవిడ్19 మరణాలు..
ఏపీలో కొవిడ్19 మరణాలు ప్రతిరోజూ దాదాపు పది వరకు నమోదవుతున్నాయి. సెప్టెంబర్ 15న ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ బారిన పడి 14,030 మంది మరణించారు. తాజాగా కోలుకున్న వారి కంటే పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,243 మంది కరోనా బారి నుంచి కోలుకోగా.. కొత్తగా 1,445 మందికి కరోనా సోకింది. మరోవైపు ఏపీలో రికవరీ రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఒక్కటే ఊరట కలిగిస్తోంది.


Also Read: ఆరేళ్ల చిన్నారిపై దారుణం, హత్య ఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్


ఏపీలో అధికంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడి చనిపోగా.. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు కొవిడ్ మహమ్మారికి చికిత్స పొందుతూ మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 74 లక్షల 75 వేల 461 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో గడిచిన 24 గంటల్లో 62,252 శాంపిల్స్ టెస్టు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.