పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు కూడా కాక ముందే పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మహమ్మారి బారినపడ్డారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం 8మంది టీచర్లకు, ఐదుగురు విద్యార్థులకు పరీక్షలు చేయగా అందరికీ పాజిటివ్‌గా తేలింది. అలాగే మంగళవారం 13 మంది టీచర్లలో 9మందికి, 35మంది పిల్లల్లో ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ నెల 22న డక్కిలి మండలంలో ఓ ఉపాధ్యాయుడు కరోనా కారణంగా మృతిచెందాడు. 


కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులోని ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. పాఠశాలలో ఇటీవల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.  ఫలితాల్లో పది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.


ఒంగోలులోని డీఆర్ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి జడ్పీ హైస్కూల్‌లోని ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. ఏడు, తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థులకు జ్వర లక్షణాలు ఉండటంతో తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ 8వ వార్డు లో ఉన్న జయప్రకాష్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. 4వ తరగతి విద్యార్థులకు 26 మంది పిల్లలకు కరోనా టెస్ట్ చేయగా 10 మంది పిల్లలకు  పాజిటివ్ గా తేలింది. 


శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గురవాం గ్రామంలో నాల్గో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ గా తేలింది.  విద్యార్థులకు కరోనా పాజిటివ్ లు వస్తుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మెుదలైంది. కరోనా కేసులు నమోదవుతున్న పాఠశాలల్లో చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.



కొత్తగా 1601 కేసులు నమోదు


ఏపీలో కొత్తగా 1601 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 58 వేల 890 మందికి కరోనా పరీక్షలు చేశారు. వైరస్‌ ప్రభావంతో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌తో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, పశ్చిమగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 1715 మంది బాధితులు కోలుకోగా... ప్రస్తుతం 13వేల 677 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Also Read: Drugs Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..