Andhra Pradesh News: ఏపీకి ప్రత్యేక హోదా సాదించడంపై అధికార తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించడం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జైరాం రమేశ్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిల పక్ష పార్టీల సమావేశంలో బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ కావాలని జేడీయూ, ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం తనకేమీ సంబంధం లేదు అన్నట్టుగా సైలెంట్‌గా ఉందని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు కరవయ్యాయని రాష్ట్రపతి పాలన విధించాలని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా ఇప్పుడీ ట్వీట్ మరింత కాకేరేపుతోంది.
బిహార్ కోసం జేడీయూ డిమాండ్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. ఏపీ నుంచి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని అధికార జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ ఎంపీలు డిమాండ్ చేశారన్నారు. లేదా ప్రత్యేక ప్యాకేజీ అయినా కావాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఏపీకి కూడా ప్రత్యేక హోదా డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దీనిపై అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేయగా, టీడీపీ నుంచి మాత్రం ఎలాంటి డిమాండ్ వినిపించలేదని జైరాం రమేశ్ తన ట్వీట్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూతోపాటు టీడీపీ కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా పాటు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి హాజరైన జైరాం రమేశ్ మాత్రం నీట్ పరీక్షపై విచారణతోపాటు కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కోసం డిమాండ్ చేశారు.
జగన్‌కు కాంగ్రెస్ మద్దతు లభిస్తుందా..?
ఈనెల 24న ఢిల్లీలో ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అదినేత జగన్ ధర్నా చేయనున్న నేపథ్యంలో ఆ పార్టీని సపోర్టు చేసేలా కాంగ్రెస్ కీలక నాయకుడు ఎంపీ జైరాం రమేశ్ ట్వీట్ చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోపక్క ఢిల్లీలో ధర్నా తర్వాత ఇతర పార్టీల నాయకులను ఎవరినైనా కలిసి జగన్ మద్దతు కోరుతారా అనేది ఆసక్తిగా ఉన్న తరుణంలో జైరాం రమేశ్ ట్వీట్ వెనుక కారణాలు ఏమై ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే నేషనల్ మీడియా ఈ ట్వీట్‌ను హైలెట్ చేయడం విశేషం. జగన్ ఢిల్లీ ప్రణాళికపై విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే జగన్‌కు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతోంది కాబట్టి జైరాం రమేశ్ ట్వీట్ చేశారా అనేది ప్రస్తుతానికి వేచి చూడాల్సిన అంశం.
ఈ అంశంపై ఒక జాతీయ పత్రికతో మాట్లాడిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఈ రెండు అంశాలు మాత్రమే కాకుండా ఏపీ ఆర్థిక పరిస్థితితోపాటు చాలా అంశాలపై తాము పార్లమెంట్‌లో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.