Fake IAS : ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారినంటూ ఓ వ్యక్తి వికాస్ మన్రాత్ ఐఏఎస్ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ తెరిచి మోసాలకు పాల్పడుతున్నారు. 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారినని ప్రస్తుతం జీఎస్‌డబ్లూఎస్ విభాగానికి జాయింట్ కమిషనర్‌గా ఉన్నానని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో చెప్పుకున్నరు. జీఎస్‌డబ్లూఎస్ గ్రామ, వార్డు సచివాలయ విభాగంగా భావిస్తున్నారు. అయితే ఈ అకౌంట్ నుంచి తాజాగా ఆయన విరాళాలు సేకరించడం ప్రారంభించారు. ఏపీలోని చిల్డ్రన్స్ ఆస్పత్రిలో లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం ఓ చిన్న పాపకు ఆపరేషన్ జరుగుతోందని పెద్ద ఎత్తున ఖర్చు అవుతోంది కాబట్టి వివరాళాలివ్వాలని కోరాడు. ఈ పోస్ట్ అంశం వైరల్ కావడంతో వెంటనే పలువురు ప్రముఖులు ప్రభుత్వ పెద్దలను సంప్రదించారు.
ఫలానా ఐఏఎస్ ఇలా పెట్టారని తాము సాయం చేస్తామని అడగడం ప్రారంభించారు. ఇదేదో తేడాగా ఉందనుకున్న ప్రభుత్వ పెద్దలు అసలు ఆ ఐఏఎస్ ఎవరా అని ఆరా తీశారు. చివరికి వికాస్ మన్రాత్ పేరుతో అసలు ఐఏఎస్ అధికారే లేరని తేలడంతో ఎవరో మోసం చేయడానికి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని గుర్తించారు., వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. విషయం తెలిసిందేమో కానీ అతను.. తన ట్విట్టర్ ఖాతా నుంచి విరాళాలు అడుగుతున్న పోస్టును తొలగించారు. అయితే పకడ్బందీగా మోసం చేయడానికి ఫేక్ ఐఏఎస్ పేరుతో ఈ ఖాతాలు నిర్వహిస్తున్నారని గుర్తించిన పోలీసులు చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు. ఆ అకౌంట్ ను ఎక్కడ క్రియేట్ చేశారు.. ఎంత మంది వద్ద విరాళాలు తీసుకున్ారన్న విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
వికాస్ మన్రాత్ పేరుతో ఐఏఎస్ అధికారి లేడని ఫ్యాక్ట్ చెక్ కూడా ప్రకటించింది. అయితే ఇప్పటికే కొంత మంది మోసపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల సీఎం జగన్ పీఏ పేరుతో పలువుర్ని మోసం చేసిన బుడమూరు నాగరాజు అనే వ్యక్తిని మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకున్న వాట్సాప్ నెంబర్‌తో..పీఏగా నమ్మించి మహారాష్ట్రకు చెందిన వ్యాపారులకు కుచ్చుటోపి వేసే ప్రయత్నం చేశారు. నాగరాజుకు డబ్బులిచ్చి మోసపోయానని గ్రహించిన బాధితుడు జనవరి 13న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ పంథాలో మోసాలు చేస్తున్న నాగరాజును..సిమ్ కార్డు తన పేరు మీదనే తీసుకున్నాడు. దీని ఆధారంగా ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నాగరాజును హైదరాబాద్‌లో అరెస్టు చేసి తీసుకువెళ్లారు.