CM Jagan Comments on Chandrababu And Pawankalyan in Banaganapalle: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) 2014లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు పవన్, బీజేపీతో కూటమితో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని సీఎం జగన్ (CM Jagan) మండిపడ్డారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఈబీసీ నిధుల విడుదల సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో రూ.629.37 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు. 'మీ బిడ్డ మీకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు.' అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు రాబోయే రోజుల్లో మరిన్ని మోసపూరిత హామీలతో మభ్య పెడతారని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 'వారు ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామంటారు. అప్రమత్తంగా ఉండాలి. ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు. మోసాలు చెప్పే వారికి ఓటు అనే దివ్యాస్త్రంతో బుద్ధి చెప్పండి.' అని జగన్ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.










'ఒక్క మంచైనా చేశారా.?'


చంద్రబాబు పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు చేసిన వంచన గుర్తొస్తుందని.. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుందని సీఎం జగన్ మండిపడ్డారు. '14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా.?. పేదవారి ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా.?. ఆయన పేరు చెబితే పేదలకు మంచి చేసిన ఒక్క పథకం అయినా గుర్తుకు వస్తుందా.?.' అని నిలదీశారు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడు గుర్తొస్తాడని ఎద్దేవా చేశారు. 'దత్తపుత్రుడు ఐదేళ్లకు ఓసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడు. ఒకరికి విశ్వసనీయత, మరొకరికి విలువలు లేవు. వీరంతా కూటమిగా ఏర్పడి మీ బిడ్డపై యుద్ధానికి వస్తున్నారు. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నారు.' అంటూ తీవ్ర విమర్శలు చేశారు.


'పేదలకు మంచి జరగాలంటే.?'


'రాష్ట్రంలో పేదల భవిష్యత్ మారాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికి చేరాలన్నా.. పిల్లల చదువులు గొప్పగా సాగాలన్నా.. రైతన్నల ముఖంలో ఆనందం కలకాలం ఉండాలన్నా.. బటన్ నొక్కడం ద్వారా నేరుగా డబ్బులు ఖాతాల్లో పడాలన్నా..' కేవలం మీ బిడ్డ పాలనలోనే జరుగుతాయని మర్చిపోవద్దని సీఎం జగన్ ప్రజలకు సూచించారు. ఓటు బటన్ నొక్కేటప్పుడు పొరపాటు జరిగితే అన్నింటికీ తెర పడుతుందని గుర్తు చేశారు. జగనన్న సీఎంగా ఉంటేనే మంచి జరుగుతుందని గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. 'బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి ధనికుడు. రామిరెడ్డికి అంత స్తోమత లేదు. ఓటు బటన్ నొక్కేటప్పుడు వైసీపీ అభ్యర్థి రామిరెడ్డికే ఓటెయ్యండి.' అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.


Also Read: TDP News: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ