ఏపీలో ఇటీవల స్కూళ్లు తెరుచుకోగా, పాఠశాలలో కొవిడ్19 నిబంధనలు తప్పకుండా పాటించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు కనిపించిన వారికి వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. అర్హులైన వారందరూ టీకాలు తప్పకుండా వేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కరోనా బారిన పడకుండా వారికి సూచనలు ఇవ్వాలన్నారు.
వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ వేసుకుంటూ వెళ్లాలని సూచించారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని చెప్పారు. పెళ్లిళ్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలని,150 మందికే అనుమతి ఉంటుందని తెలిపారు. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని జగన్ ఆదేశించారు.
ప్రభుత్వాస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలందించడంలో ఇబ్బందులు రాకూడదన్నారు.
'కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలి. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలి. ప్రాధాన్యతా క్రమంలో టీకాలు ఇస్తూ వెళ్లాలి. పాఠశాలల్లో సమర్థంగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలి. వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు పాటించేలా దృష్టిసారించాలి. మాస్క్‌లు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రుల్లో నాడు- నేడు పనులను వేగంగా చేపట్టాలి.' అని సీఎం జగన్ చెప్పారు.
వెబ్‌సైట్ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందులపైనా కూడా నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. జీఎంపీ ప్రమాణాలు పాటిస్తున్నారా?లేదా? అన్నదానిపై నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డ్రగ్‌స్టోర్లను కచ్చితంగా తనిఖీలు చేయాలన్నారు. మందులు నాణ్యతతో లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని సీఎం అన్నారు.
ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం చెప్పారు. క్రమం తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చూసే అవకాశాన్ని చూడాలన్నారు. డ్రగ్ డీలర్లు పంపిణీ చేస్తున్న మందులకు సంబంధించి ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్‌పైనా సీఎం సమీక్షించారు. న్యూమోనియా నివారణకు ఇకపై న్యూమోకోకల్ కాంజ్యుగట్ వ్యాక్సిన్‌ను (పీసీవీ) ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు.
Also Read: AP Corona Updates: ఏపీలో తాజాగా 909 కరోనా కేసులు.. కొత్తగా ఎంతమంది వైరస్ నుంచి కోలుకున్నారంటే..