తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. రుతుపవనాలు ప్రభావంతో ఇవాళ ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
పలు జిల్లాల్లో భారీ వర్షం
నిన్న తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం పడింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. సోమవారం ఉదయం 8 గంటల వరకు జగిత్యాల జిల్లా కోరుట్లలో 12.9 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు అయ్యింది. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా పుట్టపహాడ్‌లో 11.5 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా దూల్‌మిట్టాలో 10.7 సెం.మీ, జనగామ జిల్లా బచ్చన్నపేటలో 9.9 సెం.మీ, మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్‌లో 9.2 సెం.మీ, కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్‌లో 8.6 సెం.మీ, భద్రాద్రి జిల్లా పెంట్లంలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Also Read: Horoscope Today : ఆ రాశివారు ఈ రోజు శుభవార్త వింటారు... వీళ్లు మాత్రం అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు…
ఏపీలో భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రభావంతో ఇవాళ ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారుల సూచించారు. ఏపీలో గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సోమవారం కూడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ప్రభుత్వం అధికారుల్ని అప్రమత్తం చేసింది.