24 గంటల్లో ఏపీలో 46,962 మందికి కరోనా నిర్ధరణ  పరీక్షలు చేశారు. కొత్తగా 909 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. మరో 1,543 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 17,218 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.


 






నైట్ కర్ఫ్యూ


ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో విధించిన రాత్రి పూట కర్ఫ్యూను  మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ కర్ఫ్యూను ఆగస్టు 21వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కరోనా తీవ్రతపై ఏపీ సీఎం జగన్ శనివారం సమీక్షించారు. రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయంలో కరోనా ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 


అలాగే ఏపీలో ఇవాళ నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో తరగతుల నిర్వహణకు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తరగతి గదికి 20 మంది విద్యార్ధులు మించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలు తెరవనున్నారు. స్థానిక పరిస్థితుల అనుగుణంగా పాఠశాలలు తెరిచేందుకు ఎస్‌వోపీ ఉండాలని విద్యాశాఖ తెలిపింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు బ్యాచ్ ల వారీగా తరగతులను నిర్వహించాలని పేర్కొం‍ది.


Also Read: Is People Culprits : నడిరోడ్డుపై హత్యలు ! రక్షించని ప్రజలదే నేరమా..?