ఆంధ్రప్రదేశ్‌లో సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా అన్ని రకాల క్యాన్సర్‌లకు ఒకే గొడుగు కింద ఉచితంగా చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామని సీఎం జగన్ తెలిపారు. తిరుపతిలో టాటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ రీసెర్చ్‌ ( SVICCAR ) అసుపత్రిని జగన్ ప్రారంభించారు.  టాటా సంస్థ అద్భుతమైన క్యాన్సర్‌ అసుపత్రిని ఏర్పాటు చేయడాన్ని సీఎం స్వాగతించారు. ఈ ఆసుపత్రికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం  సహాయ సహకారాలు అందిస్తాయని, ఇక్కడ అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం తక్కువ ధరకు రోగులకు అందుతుందని  ప్రకటించారు. పేదరోగులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం టిటిడిని కోరిందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్‌తో చనిపోకూడదని లేదా చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనేది తమ అంతిమ లక్ష్యమని జగన్ చెప్పారు.


టాటా సంస్థ, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అత్యాధునిక అంకాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు. క్యాన్సర్‌ సంరక్షణ, చికిత్సపై సీఎం దూరదృష్టిని ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు  అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్‌ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. పీడియాట్రిక్‌ ఆంకాలజీ సెంటర్‌, ప్రివెంటివ్‌ ఆంకాలజీ, సెంటర్‌ ఫర్‌ పెయిన్‌ అండ్‌ పాలియేటివ్‌ కేర్‌ను ఏర్పాటు చేయాలని, భారతదేశంలో క్యాన్సర్‌ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని ఆయన చెప్పారు.


 అంతకుముందు సీఎంకు టాటా క్యాన్సర్ కేర్‌ ఆసుపత్రిపై 5 నిమిషాల విజువల్ చూపించారు. టాటా ట్రస్ట్‌ సీఈవో శ్రీ ఎన్‌.శ్రీనాథ్‌ ఈ సందర్భంగా ఏసీఎఫ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ సంజీవ్‌ గుప్తా, ఇతర వైద్యులను సీఎంకు పరిచయం చేశారు. అనంతరం స్వీకార్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వీఆర్.రమణన్ అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించారు. టాటా క్యాన్సర్ కేర్ నాలుగు స్తంభాలపై అభివృద్ధి చెందిందని, ఇందులో మెరుగైన యాక్సెస్, యూనిఫాం హైక్వాలిటీ కేర్, అఫర్డబుల్ కేర్ మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా ముందస్తుగా గుర్తించడం వంటి అంశాలు ఉన్నాయన్నారు.  


స్వీకార్ ఆస్పత్రి ప్రారంభం కావడంతో ఒక్క తిరుపతి వాసులకే కాక.. రాయలసీమ ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్‌కు చికిత్స లభించనుంది.