ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని సీఎం జగన్‌ ( CM Jagan ) ప్రకటించారు. కొత్త జిల్లాలు ( New Districts ) ప్రక్రియపై ఉన్నతాధికారులతో సమీక్ష నిరవహించారు. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉందని దానికి సంబంధించిన సన్నాహాలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీలకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించాలన్నారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. 


షోలు, టిక్కెట్ రేట్ల పెంపు, విశాఖలో స్థలాలు - టాలీవుడ్ ప్రముఖులకు జగన్ వరాలు !


కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాలు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపైనా సీఎం జగన్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ( Andhra Pradesh )  ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ గత నెల 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ చర్యలు చేపట్టింది.కొత్త జిల్లాల ఏర్పాటు. పై పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. 


మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని అందుకునే పనిలో టీఆర్ఎస్ - మోదీ మాటలతో రాజకీయ కార్యాచరణ !


కడపలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. దీంతో హిందూపురంలో ఆందోళనలు మొదలయ్యాయి. అన్ని సదుపాయాలు ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్నాయి. నోటిఫికేషన్‌ జారీ చేసిన 30 రోజుల్లోగా జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. 


ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి.. అవసరమైతే రీ-నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అన్నీ పరిశీలించి ఎక్కువ అభ్యంతరాలు ఉన్న చోట రీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే సీఎం జగన్ చెప్పినట్లుగా ఉగాది నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కావాలంటే అనేకరకాలైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నారు.