CM Jagan : దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. 2022-ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో సీఎం మాట్లాడారు. బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుందని తెలిపారు.
చంద్రబాబు హయాం కన్నా రెట్టింపు పరిహారం
ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు మాత్రమేనని జగన్ తెలిపారు. మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు అన్నారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టామన్నారు. ప్రతి ఏటా మూడు విడతల్లో వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నాం. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30 వేల 985 కోట్లు రైతు భరోసా ఇచ్చామన్నారు. గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నామని జగన్ గుర్తు చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు.. రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారు. చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోందని మడిపడ్డారు.
చంద్రబాబు హయాంలో కరువులోనూ పరిహారం ఇవ్వలేదు !
కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. విత్తనం మొదలు పంట అమ్మకం వరుకు ఆర్బీకే రూపంలో రైతుకు తోడుగా ఉంటున్నామని సీఎం తెలిపారు. ఏ సీజన్‌లో పంటనష్టం జరిగినా ఆ సీజన్ ముగియక ముందే పరిహారం అందిస్తున్నామన్నారు. సున్నా వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నాం. సున్నా వడ్డీ రుణాల్లో ఏపీ అగ్రగామిగా ఉందన్నారు. ''రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్ ఇచ్చేలా విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. చుక్కల భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించాం. పశువుల కోసం 340 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. పాడి రైతులకు ఆదాయం వచ్చేలా అమూల్‌ను తీసుకొచ్చాం'' అని సీఎం తెలిపారు.
గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం !
పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని జగన్ ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం నాలుగేళ్లలో రూ.58,767 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పంటల కొనుగోళ్ల కోసం మరో రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మనకు పాడిపంటలు ఉండే పాలన కావాలా? లేక నక్కలు, తోడేలు ఉండే పాలన కావాలా? అని రైతుల్ని ప్రశ్నించారు.
రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా?
రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా? అని రైతుల్ని జగన్ ప్రశ్నించారు. రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా? దళారీ వ్యవస్థ కావాలా?. పేదల ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా?. ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో పేదలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నైతికత లేని వ్యక్తిని చంద్రబాబు అంటారన్నారు. వీళ్లలా తనకు అబద్ధాలు చెప్పడం రాదన్నారు.