CM Chandrababu Comments in Srikakulam: రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని.. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో దీపం 2.0లో భాగంగా ఆయన శుక్రవారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాజీ లేని పోరాటం చేశారని.. వైసీపీ నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. 'నేను బాధ్యత గల ప్రజాప్రతినిధిని. తప్పు చేసిన వారిని వదిలిపెట్టను. రాజకీయ కక్షసాధింపులకు పోను. నాయకుడు అంటే ప్రజల మనసుల్లో అభిమానం ఉండాలి. గత ఐదేళ్లలో సీఎం వస్తే పరదాలు కనిపించేవి. నేడు ఆ పరిస్థితి లేదు. వైసీపీ హయాంలో సభలకు ప్రజలను బలవంతంగా తరలించారు. చెడుపై మంచి గెలిచిందనే దీపావళి చేసుకుంటున్నాం. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిని నేను. కట్టెల పొయ్యితో మహిళలు పడిన బాధలు తెలుసు. దీపం పథకం కింద సిలిండర్ ఇచ్చి మహిళల కష్టాలు తీర్చాను.' అని సీఎం పేర్కొన్నారు.






టీ చేసిన చంద్రబాబు


కాగా, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు స్వయంగా ఓ మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేశారు. ఈ క్రమంలో టీ తయారీకి అవసరమైన వస్తువులు అందివ్వడంలో అక్కడి వారు కాస్త కంగారుపడుతుంటే కూల్‌గా ఉండాలని తాను వచ్చాననే టెన్షన్ వద్దంటూ చెప్పుకొచ్చారు. టీ చేస్తూనే శాంతమ్మతో మాట్లాడిన సీఎం ఆమె కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీ మరిగిన తర్వాత ఆయనే వడపోసి అందరికీ  ఇచ్చారు. ఈ టీ బిల్లు చెల్లించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో చమత్కరించారు. ఆయనకు కూడా అదే స్పీడ్‌తో... ఏ నిధుల నుంచి చెల్లించాలంటూ రిప్లై ఇచ్చారు. నీ ఇష్టమని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నా అభ్యంతరం లేదన్నారు. 






మహిళకు సొంతింటి హామీ


అనంతరం సీఎం జానకమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి ఒంటరి పింఛను అందజేశారు. స్వయంగా సీఎం తన ఇంటికి రావడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు సొంతిల్లు కావాలని ఆమె చంద్రబాబును కోరారు. ఇల్లు కట్టిస్తానని.. శుక్రవారం నుంచే ఇంటి పని ప్రారంభిస్తారని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.


Also Read: Andhra Pradesh: పులివెందుల ఎమ్మెల్యేను ఫేక్ జగన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? టీడీపీ పోస్ట్ వైరల్