YS Jagan is Fake Person TDP posts | అమరావతి: తాను చేసిన పనిని వేరే వాళ్ల మీద తోసేసి, తప్పించుకోవాలని చూడటం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తాను చేసింది వేరే వాళ్ల మీద తోయాలని చూస్తారని.. అందుకే మిమ్మల్ని ఫేక్ జగన్ అంటారంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించిన ఘనత వైసీపీ అధినేత జగన్ దేనని టీడీపీ కొన్ని జీవోలు, పోస్టులను బహిర్గతం చేసింది. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు అంటూ టీడీపీ తాజాగా చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ చేసిన సంచలన పోస్టులు ఇవే
‘రెండు ఫేజులు అంటూ పోలవరం ప్రాజెక్టు ఎత్తున 41.15 మీటర్లకు కుదించిన ఘనత మీదే కదా జగన్, మర్చిపోయారా ? మర్చిపోయినట్టు నటిస్తున్నారా ? పోలవరం ప్రాజెక్టును రెండు ఫేజుల్లో నిర్మిస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలుమార్లు ప్రతిపాదనలు పంపించింది మీ ప్రభుత్వంలోనే కదా, ఫేకు జగన్. 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్-I&II అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సి.ఎస్. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఓ.కు లేఖ రాసి, డబ్బులు అడగలేదా ? మీరు, గతంలో మీ సారధ్యంలో ఉన్న మీ అధికారులు 41.15 మీటర్ల కోసం రాసిన లేఖలు మర్చిపోయారా ? మర్చిపోయినట్టు నటిస్తున్నారా ? మీ దొంగ సాక్షిలో, గతంలో మీరు చేసిన పనులు మీరే రాసుకుని, మా పై దుష్ప్రచారం చేస్తున్నారా ?
కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదు
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మా కూటమి ప్రభుత్వం మీ లాగా ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండదు. గతంలో, 2014-19 మద్య చంద్రబాబు గారు ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మించి తీరుతాం.. పోలవరం ప్రాజెక్ట్ 45.72 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది. 150 అడుగులు నీరు నిలిపేది చంద్రబాబు. 45.72 మీటర్ల ఎత్తులో నీళ్ళు నిలబెడితేనే, చంద్రబాబు గారి కల అయిన నదుల అనుసంధానం జరిగి, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించేది. ఇందులో మా ప్రభుత్వానికి రాజీ ఉండదు. మీరు ఫేకు రాతలు మాని, ప్రజలకు ఉపయోగపడే రాతలు రాసి, ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి’ అని మాజీ సీఎం జగన్ కు టీడీపీ నేతలు అధికారిక ఎక్స్ ఖాతాలో హితవు పలికారు.