Lokesh Padayatra : టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి‌ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర జనవరి 27వ తేదీన కుప్పం నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. యువగళం పాదయాత్రకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించక ముందు నుంచి అనేక అడ్డంకులు ఎదురైనా విజయవంతంగా ప్రారంభించిన నారా లోకేశ్ పాదయాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో‌ నెంబర్-1 నిబంధనల ప్రకారం లోకేశ్ తన పాదయాత్ర కొనసాగించాలని పోలీసుల నుంచి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పోలీసుల ఆంక్షల మేరకు నారా లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ నలభై రోజుల పాటు దిగ్విజయంగా పాదయాత్రను కొనసాగించారు. అయితే రేపు, ఎల్లుండి లోకేశ్ పాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు. 


76 మందిపై కేసులు 


నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నలభై రోజులు పూర్తి చేసుకుని నలభై ఒకటో రోజున తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున రేపు, ఎల్లుండి పాదయాత్రకు నారా లోకేశ్ విరామం ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 27వ తేదీన మొదలైన ఈ పాదయాత్ర నిన్నటితో నలభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో జోవో నెంబర్ -1 కు వ్యతిరేకంగా ప్రవర్తించారంటూ నారా లోకేశ్ పై 22 కేసులు నమోదు చేయడంతో పాటు మొత్తం 76 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 13 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో నలభై ఒకటో రోజు యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ పాల్గొంటున్నారు. నలభై రోజుల పాటు జరిగిన యువగళం పాదయాత్రలో మొత్తం 520 కిలోమీటర్ల మేర లోకేశ్ యువగళం పాదయాత్ర సాగింది. లోకేశ్, అచ్చెన్నాయుడుతో సహా 76 మందిపై పోలీసులు కేసులు పెట్టారు.  అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా పాదయాత్రకు నారా లోకేశ్ రేపు, ఎల్లుండి విరామం ప్రకటించారు. తిరిగి ఈ‌ నెల 14వ తేదీన లోకేశ్ యువగళం పాదయాత్రను తిరిగి‌ తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. 


పన్నుల కారణంగానే నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయ్ 


సీఎం జగన్ పాలనలో అందరూ బాధితులేనని నారా లోకేశ్ విమర్శించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది.  అంగళ్లలో నారా లోకేశ్ చూసేందుకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. లోకేశ్ ను కలిసి అంగళ్లు నిర్వహిస్తున్న యువకులు, మహిళలు, వృద్ధులు తమ సమస్యలు చెప్పుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు ఆవేదన చెందారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ కట్ చేశారని పలువురు వృద్ధులు వాపోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక బెంగుళూరు వెళ్లి పనులు చేసుకుంటున్నామని అంగళ్లు నిర్వహిస్తున్న యువకులు అన్నారు.  లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న పన్నుల కారణంగానే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం జగన్ అడ్డగోలుగా పెంచిన అన్ని పన్నులు తగ్గిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 6 లక్షల పింఛన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని లోకేశ్ ఆరోపించారు. చివరికి చెత్త పన్ను కూడా పింఛన్ లో కట్ చేసే దారుణమైన ప్రభుత్వం వైసీపీదని  విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బడా కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్నారు.