Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ను NSE బంతాట ఆడుకుంటోంది. షార్ట్‌ టర్మ్‌ - లాంగ్‌ టర్మ్‌ నిఘా ఫ్రేమ్‌వర్క్‌ మధ్య వాటిని మారుస్తూ అల్లాడిస్తోంది. అయితే, పెట్టుబడిదార్ల ప్రయోజనాలు కాపాడడానికే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది.


అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ టోటల్ గ్యాస్‌ ‍‌(Adani Total Gas)ను దీర్ఘకాలిక అదనపు నిఘా ఫ్రేమ్‌వర్క్ (long-term additional surveillance framework) స్టేజ్-I నుంచి స్టేజ్‌-II కి ఎన్‌ఎస్‌ఈ మార్చింది. సోమవారం (13 మార్చి 2023) నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది.


ఈ వారం ప్రారంభంలో, ఎక్స్ఛేంజ్ అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), న్యూఢిల్లీ టెలివిజన్‌ను (NDTV) కూడా స్టేజ్-I నుంచి స్టేజ్-II నిఘాకి నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ తరలించింది.


ఎక్కువ అస్థిరతతో స్టాక్స్‌ కదులుతున్న సందర్భాల్లో, పెట్టుబడిదార్లను స్పెక్యులేటివ్ ట్రేడ్స్‌ నుంచి రక్షించడానికి స్టాక్‌ ఎక్సేంజీలు రంగంలోకి దిగుతాయి. ఆయా స్టాక్స్‌ను స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక అదనపు నిఘా ఫ్రేమ్‌వర్క్‌ కిందకు తీసుకెళ్తాయి. తద్వారా వాటిలో ట్రేడింగ్‌ను నియంత్రించి, పెట్టుబడిదార్ల పెట్టుబడిని కాపాడే ప్రయత్నం చేస్తాయి.


అదానీ స్టాక్స్‌లో భారీ స్వింగ్స్‌
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research), అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా నివేదికను విడుదల చేసినప్పటి నుండి అదానీ గ్రూప్ స్టాక్స్‌ ఒక నెలకు పైగా భారీ స్వింగ్స్‌ చూశాయి.


GQG Partners వచ్చి అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టడం & షేర్ల తనఖా రుణాలను అదానీ కొంతమేర చెల్లించిన తర్వాత, వారం రోజులుగా లాభాలు సాధించిన కొన్ని కంపెనీల షేర్లు మళ్లీ దక్షిణం వైపునకు (డౌన్‌ సైడ్‌) ప్రయాణం ప్రారంభించాయి.


అంతకుముందు ఆరు సెషన్‌లలో ర్యాలీ చేసిన అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises), గత రెండు సెషన్‌లలో 11% నష్టపోయింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్ వరుసగా 7 వరుస సెషన్‌ల పాటు 5% అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. ఈ 7 సెషన్లలో, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ తలో 40% పైగా లాభపడ్డాయి.


2 దశల్లో నిఘా
స్టాక్‌ ఎక్సేజీలు 2 దశల్లో సెక్యూరిటీలను దీర్ఘకాలిక నిఘా ఫ్రేమ్‌వర్క్ కిందకు తరలిస్తాయి. 


స్టేజ్ I కింద.. ఒక అస్థిర స్టాక్‌కు 5% లేదా అంతకంటే తక్కువ.. ఏది వర్తిస్తే దానిని ప్రైస్‌ బ్యాండ్‌గా ఎక్సేంజీలు ఫిక్స్‌ చేస్తాయి. ఇలాంటి స్టాక్స్‌లో ఇంట్రాడే ట్రేడ్‌ చేయాలంటే 100% మార్జిన్‌ను ట్రేడరే తెచ్చుకోవాలి.


స్టేజ్‌  II కింద... షార్ట్‌లిస్ట్ చేసిన సెక్యూరిటీలను మరింత ఎక్కువ పర్యవేక్షణలోకి ఎక్సేంజీలు తీసుకువస్తాయి. అన్ని నిబంధనలు సంతృప్తి పడితే ట్రేడ్-ఫర్-ట్రేడ్ సెటిల్‌మెంట్‌కు తరలిస్తాయి.


జనవరి చివరి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్‌లో కనిపించిన విపరీతమైన స్వింగ్‌ల వల్ల, ఎక్స్ఛేంజీలు ఆయా స్టాక్స్‌ను అదనపు నిఘాలోకి తెచ్చాయి, పెట్టుబడిదార్లను భారీ నష్టాల నుంచి రక్షించాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.