మహిళా సాధికారత! విమెన్ రిజర్వేషన్ బిల్‌! దేశంలో దశబ్దాలుగా వినిపిస్తున్న మాట! ఇది నినాదంగానే మిగిలిపోయింది! రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ ఈ పోరాటం ఏదో రూపంలో తెరమీదకి వస్తూనే ఉంది! తాజాగా బీఆర్ఎస్ నేతృత్వంలో రిజర్వేషన్లపై హస్తిన ప్రతిధ్వనించింది! ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏం చేసిందో,  ప్రధాని మోదీకి ఒక లేఖ రాసింది! తెలంగాణలోని స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయని లెటర్లో స్పష్టం చేసింది! బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ,  మేయర్లు, జడ్పీ చైర్ పర్సన్లంతా కలిసి ఈ లేఖ రాశారు.  


మోదీకి లేఖ రాసిన మహిళా ప్రజాప్రతినిధులు  


ప్రధాని మోదీకి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మహిళలకు పదవుల్లో కల్పించిన రిజర్వేషన్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. చట్ట ప్రకారం స్థానిక సంస్థల్లో  మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా.. 50% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టుగా లెక్కలతో సహా వివరించారు. అవేంటో చూడండి!


తెలంగాణలో యాభై శాతం పొలిటికల్ రిజర్వేషన్లు


తెలంగాణలో మొత్తం 1,13,354 గ్రామ వార్డులుంటే,  మహిళా వార్డు మెంబర్ల సంఖ్య 59,408. సర్పంచుల విషయానికొస్తే, 12,751 సర్పంచ్ స్థానాల్లో మహిళా సర్పంచుల సంఖ్య 6844. మొత్తం  5,857 ఎంపీటీసీ స్థానాల్లో మహిళా ఎంపీటీసీలు 3,326 మంది ఉన్నారు. రాష్ర్టంలోని 539 జడ్పిటిసి  స్థానాల్లో  మహిళా జడ్పీటీసీలు 300 మంది గెలిచారు. 539 ఎంపీపీ  సీట్లలో మహిళా ఎంపీపీల సంఖ్య 340. ఇకపోతే, 32 జడ్పీ స్థానాల్లో  20 చోట్ల మహిళలకు కేటాయించారు. 125 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల సంఖ్య 2,849 కాగా, అందులో మహిళా కౌన్సిలర్లు 1520  మంది. 125 మున్సిపల్ చైర్ పర్సన్ పదవులకు గాను 72 చోట్ల మహిళలకే అవకాశం కల్పించారు. 13 కార్పొరేషన్లలో కార్పొరేటర్ల సంఖ్య 661 కాగా, మహిళా కార్పొరేటర్ల సంఖ్య 351. మొత్తం 13 మేయర్ స్థానాలకుగాను మహిళలకు  8 చోట్ల అవకాశం ఇచ్చారు.


స్థానిక సంస్థల్లో మహిళలకే ప్రాధాన్యం                    


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తమ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల అన్నింటిలోనూ రాజకీయపరమైన రిజర్వేషన్లను అందించిందని.. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల మేరకు భారత రాష్ట్ర సమితి సైతం స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలకు అవకాశం ఇచ్చి పదవులు కట్టబెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతోపాటు మార్కెట్ కమిటీల నియామకాల్లోనూ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించిన అంశాన్ని ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారు.


కవిత దీక్షపై స్పందించి మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్               


ఇప్పటికైనా ప్రధానమంత్రి మోదీ మహిళా రిజర్వేషన్ల పైన వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళా సాధికారికత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని, విజ్ఞప్తి చేశారు. కవిత చేపట్టిన మహిళా రిజర్వేషన్ల దీక్షకు దేశంలోని దాదాపు మెజార్టీ పార్టీలు మద్దతు అందించాయని, ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల పైన భారతీయ జనతా పార్టీ తమ నిర్ణయాన్ని వెంటనే ప్రకటించి, మహిళా రిజర్వేషన్ల కోసం చట్టం చేయాలని డిమాండ్ చేశారు.