Kanipakam Temple : సత్య ప్రమాణాలకు నిలయంమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిత్యం ప్రమాణాలు అంటే ఎంతటి వారైనా భయపడాల్సిందే. బావిలో నుంచి వెలసిన విఘ్నేశ్వరుడు‌ పెరుగుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ప్రతి నిత్యం వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి‌ భక్తులు కాణిపాకం ఆలయానికి చేరుకుని స్వామి వారి దర్శన భాగ్యం పొందుతుంటారు. రోజు దాదాపుగా ఇరవై వేలకు పైగా భక్తులు కాణిపాకంలో మొక్కులు చెల్లించుకుంటారు. అయితే స్వామి వారిపై భక్తి భావంతో భక్తులు వారి స్థోమతకు తగ్గట్టుగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు, భూములను విరాళంగా అందిస్తారు. ఇలా స్వామి వారికి అందించిన ఆభరణాలను కాణిపాకం ఆలయ ఈవో స్ట్రాంగ్ రూంలో భధ్ర పరుస్తారు. కాణిపాకం ఆలయాన్ని పునఃనిర్మాణం పూర్తి అయిన తరువాత ఆలయ కుంభాభిషేకం రోజున స్వామి వారి మూలవరుల విగ్రహాన్ని అలంకరించేందుకు బంగారు విభూతి పట్టీని విరాళంగా అందించారు. 


యాగశాలలో ప్రత్యక్షం 


ఓ దాత అందించిన విభూతి పట్టీ ఉన్నట్టుండి మాయం అయ్యింది. ఆలయం విరాళాల రశీదు పుస్తకంలో విరాళానికి సంబంధించిన వివరాలు లేక‌పోవడంతో విరాళం విషయాన్ని అధికారులు, పాలక మండలి మరిచిపోయింది. ఇంతలో దాత తనకు రశీదు పత్రం అందించలేదని కోరడంతో గుర్తు చేసుకున్న అధికారులు విభూది పట్టీ ఆభరణంపై ఆరా తీశారు. నలభై ఐదు రోజులగా ఆలయంలో కనిపించని ఆభరణం ఉన్నట్టుంది ఆలయంలోని యాగశాలలో ప్రత్యక్షం అయ్యింది. అసలు తిరిగి యాగశాలలోకి ఆభరణం ఎలా వచ్చిందంటే? 


రూ.18 లక్షల విలువైన ఆభరణం  


ఆలయాలు సందర్శించిన సమయంలో భక్తులు తమ స్థోమతకు తగ్గట్టుగా విరాళాలు ఇవ్వడం తరచూ జరిగే విషయమే. కానీ ఇలా విరాళాలు అందిన భక్తులకు వెంటనే అందుకు సంబంధించిన రశీదును అధికారులు ఇస్తారు. అయితే కాణిపాకం ఆలయంలో భక్తుడు స్వామి వారిపై భక్తిభావంతో విభూది పట్టీని విరాళంగా ఆలయ కుంభాభిషేకం నాడు అందజేశారు. అయితే కుంభాభీషేకం ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలోని ముగ్గురు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్.కే. రోజాలు హాజరయ్యారు. మంత్రులు, అధికారులు, భక్తులతో ఆలయంలో హడావిడి‌గా ఉండే సమయంలో వేలూరుకు చెందిన ఒక ట్రస్ట్ నుంచి కుంభాభిషేకం రోజు సుమారు 18 లక్షలు విలువ చేసే బంగారు విభూదిపట్టిని విరాళంగా ఆలయ అర్చకుడి చేతికి అందజేశారు. కుంభాభిషేకం రోజు స్వామి వారి మూలవిరాట్ కి అలంకరించి తర్వాత ఆలయ అర్చకుడు బంగారు విభూదిపట్టిని ఇంటికి తీసుకుని వెళ్లిపోయారు. ఆలయ అధికారులు సైతం కుంబాభిషేకం రోజు స్వామివారి పైన ఉన్న బంగారు విభూదిపట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు అనే సంగతి అడగటం మరచారు. 


40 రోజుల తర్వాత 


అసలు విరాళం అందిన సంగతి అధికారులకు గానీ, పాలక మండలికి గానీ తెలియక పోవడంతో ఆభరణం గురించి ఎవరూ అడగలేదు. ఆలయ కుంభాభిషేకం అనంతరం 10 రోజుల తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు 21 రోజులు నిర్వహించారు. అయితే తాము అందించిన విరాళానికి తమకు ఎటువంటి రశీదు ఇవ్వలేదని దాత  అధికారులను కోరారు. దీనిపై ఆరా తీసిన అధికారులు ఎవరికి ఇచ్చారో విచారణ చేపట్టారు. దీంతో విషయం బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన పది రోజుల తరువాత వెలుగు చూసింది. ఆలయంలో పని చేస్తున్న అర్చకుడు ఆ విభూతిపట్టీకి ఎలాంటి రసీదు ఇవ్వకపోవడంతో ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోని బీరువాలో దాచుకున్నాడు. బంగారు విభూదిపట్టి విరాళం ఇచ్చిన దాతలు 40 రోజులైనా వాళ్లకు స్వామి వారి ఆలయం నుంచి విభూదిపట్టి విషయంలో ఎటువంటి రశీదు రాకపోవడంతో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరా తీసిన మంత్రికి అధికారులు విషయం మొత్తం తెలియజేశారు. అయితే విషయం తెలుసుకున్న అర్చకుడు ఏం ఎరుగనట్టు బంగారు విభూధి పట్టీని ఎవరికి తెలియకుండా ఆలయంలోని యాగశాలలో ఉంచాడు. 


రేపు ఆలయానికి మంత్రి 


అయితే యాగశాలో అర్చకులు, అధికారులు, పాలక మండలి సభ్యులకే మాత్రమే అనుమతి ఉంటుంది. లక్షల విలువ చేసే ఆభరణం విషయంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని దాతలు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంత జరిగినా విభూదిపట్టి కాజేసేందుకు ప్రయత్నించిన ఆలయ అర్చకుడిపై అధికారులు ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అయితే విభూది పట్టి మాయం అయిన ఘనట బయటకు వస్తే ఆలయ అధికారుల నిర్లక్ష్యం బయట పడుతుందని అధికారులు, పాలక మండలి విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.. రేపు కాణిపాకం ఆలయానికి దేవదాయ శాఖ మంత్రి రానున్నారు. ఈ విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్తారో లేదో అనేది మాత్రం తెలియాల్సి ఉంది. 


ఆలయ ఈవో ఏం చెప్పారంటే?


కాణిపాకం ఆలయంలో దాత విరాళంగా అందిన విషయంపై ఏబీపీ దేశం ప్రతినిధి ఆలయ ఈవోని ఫోన్ ద్వారా వివరణ అడుగగా విరాళంగా అందించిన విభూది పట్టీకి సంబంధించిన రశీదును దాతకు అందించామన్నారు. తాను నూతనంగా భాధ్యతలు చేపట్టడంతో ఈ విషయాలు తమకు తెలియదని, విభూది పట్టి విషయం తమ దృష్టికి రావడంతో ఆరా తీసి ఆభరణం స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.