Chittoor News : ప్రస్తుత సమాజంలో యువత మొదలుకుని పండు ముసలి వరకూ చుక్క పడాల్సిందే అంటున్నారు. కొందరు సరదాకు తాగుతుండే మరికొందరు వ్యసనంగా తాగుతున్నారు. మద్యం మత్తుకి బానిసగా మారుతున్నారు. కొందరు మద్యం తాగి గొడవకు దిగి చుట్టు పక్కల వారిని భయాందోళనకు గురి చేస్తే మరికొందరు మద్యం మత్తుల్లో యద్ధేచ్చగా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఇంకొందరైతే ప్రమాదాలకు గురై కుటుంబాన్ని నడిరోడ్డులో నెలబెడుతున్నారు. రోజు రోజుకి రహదారుల్లో ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో నివారణ చర్యల్లో భాగంగా చిత్తూరు జిల్లా పోలీసుల సరికొత్త ఆలోచనతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
ప్రమాద రహిత జిల్లాగా
చిత్తూరు జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు పోలీసులు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక కార్యాచరణాలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో "ఒక ప్రాణం కాపాడిన చాలు" అనే నినాదంతో చిత్తూరు జిల్లా పోలీసులు సరికొత్త విధానంతో ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలతో పాటు స్పెషల్ డ్రైవ్ లు కూడా నిర్వహించి వాహన ప్రమాదాలను తగ్గిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో రోడ్డు సెఫ్టీలో భాగంగా గత రెండు రోజులు శని, ఆది వారాలలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తులకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించారు.
(డీఎస్పీ సుధాకర్ రెడ్డి )
విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్
మద్యం తాగి వాహనాలను నడిపే వారిపై చట్టం ప్రకారం చర్య తీసుకొని రూ. 1,000 నుంచి రూ.2,000 ల వరకు జరిమానాతో బాటు 3 రోజుల వరకు జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. గత వారం రెండు రోజులుగా జరిపిన ఈ స్పెషల్ డ్రైవ్ లో 100 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. 20 మందికి 3 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 1,000 జరిమానాను, అలాగే 40 మందికి రూ.2,000 లను జరిమానా విధించారు. ఇకపై ప్రజలు ఈ విషయం గుర్తించి మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబంలో ఒకరు మృతి చెందితే ఆ కుటుంబం నష్టపోతుందని, కావున కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతగా వాహనాలను నడపాలని డీఎస్పీ తెలియజేశారు. అంతే కాకుండా విద్యా సంస్థల్లో విద్యార్ధులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న దాదాపు యాభై మంది విద్యార్ధుల వాహనాలను స్వాధీనం చేసుకుని, విద్యార్ధుల తల్లిదండ్రులను స్టేషన్ పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.