ప్రపంచ వాయు వేగంతో పరుగులు పెడుతున్న నేటి కాలంలోనూ వింత ఆచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో ఆచరించే ఆచార సంప్రదాయాలను చూసి ఎవరైనా సరే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామంలో వింత ఆచారాన్ని నేటికీ పాటిస్తున్నారు. ఆ గ్రామానికి వెళ్లే ముఖ ద్వారం వద్ద పదకొండు చింత చెట్లు దర్శనమిస్తాయి. ఎవరైనా ఆ గ్రామానికి మెదటిసారి వెళ్తే ఆ చింత చెట్లను చూసి భయాందోళనకు గురవుతుంటారు. ఆ పదకొండు చింత చెట్ల నిండా గబ్బిలాలు వేళాడుతూ వింతైన శబ్దాలు చేస్తూ ఉంటాయి. అయితే ఆ గబ్బిలాలను ఆ గ్రామస్తులు దైవంగా భావించి నిత్యం పూజలు చేస్తుంటారు. ఆదివారం వస్తే చాలు ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తుంటారు. రాత్రుళ్లు ఆహార వేటలో ఉండే ఈ గబ్బిలాలు తెల్లారేసరికి తిరిగి ఆ చింత చెట్టు వద్దకు చేరుకుంటాయి.
అనారోగ్య సమస్యలు నిరోధించేందుకు గబ్బిలాలకు పూజలు
గబ్బిలాలను దైవంగా కొలవడం ఆ గ్రామస్తులకు ఇటీవల వచ్చిన సంప్రదాయం కాదు. పూర్వీకుల వద్ద నుంచి వచ్చిన ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ గబ్బిలాలు ఉండడం వల్లనే తమ గ్రామానికి ఎటువంటి ఆపద వాటిళ్లడంలేదని, అందరూ సంతోషంగా ఉండగలుగుతున్నామని ఆ గ్రామస్తులు అంటున్నారు. అంతే కాకుండా తమ గ్రామంలో గబ్బిలాలు ఉండడం కారణంగానే చాలా మంది తమ పిల్లలకు చిన్నతనంలో వచ్చే సమస్యలను అధిగమించేందుకు ఆ చెట్ల వద్దకు వచ్చి గబ్బిలాలకు పూజకు నిర్వహిస్తుంటారని అంటున్నారు. సాధారణంగా చిన్నతనంలో పిల్లలు బరువు తక్కువగా పుట్టడం, సన్నని కాళ్లు, చేతులు కలిగి పుట్టడం చూస్తుంటాం. అలాంటి వారిని ఈ చెట్ల వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి, ఆ చెట్ల కొమ్మలతో వేడి చేసిన నీటితో వారికి స్నానం చేయించి, వారి ధరించిన దుస్తులను ఆ చెట్లకు కడితే పక్షి దోష పరిహారం చేస్తుంటారు. ఇలా దైవ స్వరూపంగా భావించే గబ్బిలాలకు ఎవరైనా కీడు చేయాలని వస్తే వారిని అదే చెట్టుకు కట్టివేస్తుంటారు. ఆ గ్రామస్తులు.
గబ్బిలాలే రక్షిస్తాయని నమ్మకం
కరోనా సమయంలో గబ్బిలాలు చూసి అందరూ భయపడిన ఆ గ్రామస్తులు మాత్రం ఎటువంటి భయం లేకుండా గబ్బిలాలకు పూజలు నిర్వహించారు. ప్రతి రోజు ఇంటి ఒక్కొక్కరు చొప్పున ఆ గబ్బిలాలకు పూజలు నిర్వహిస్తారు. పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన వాటిని నేటిని కొనసాగించడడం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఆ గ్రామస్తులు అంటున్నారు. ఆ గబ్బిలాలే తమ గ్రామానికి రక్షణగా ఉంటున్నాయని గ్రామస్తులు అంటున్నారు.
Also Read: విశాఖ మన్యంలో కాల్పుల కలకలం... పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి... తుపాకులకు పనిచెప్పిన నల్గొండ ఖాకీలు