Pattipati Pullarao : టీడీపీ అధినేత చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన లోకేశ్ పాదయాత్రపై వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై తమకు క్లారిటీ ఉందన్నారు. లోకేశ్ యువగళం పాదయాత్ర అరాచకపాలన అంతమొందించి, చంద్రబాబును సీఎం చేసేందుకే అన్నారు. ఇటీవల వచ్చిన సర్వేల్లో వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు. వచ్చే ఎన్నికలలో‌ వైసీపీ ఇంటికే అంటూ ఆరోపించారు. లోకేశ్ పాదయాత్ర పూర్తి అయితే 175 నియోజకవర్గాలలో ఆ ప్రభావం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై మేము స్పష్టంగా ఉన్నామని, వైసీపీ నేతలే కన్ఫ్యూజ్ లో‌ ఉన్నారన్నారు. 


వైసీపీలోనే సీఎం ఎవరనే కన్ఫ్యూజన్ 


"లోకేశ్ పాదయాత్ర ఎందుకని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పగలరా అని మంత్రులు అంటున్నారు. లోకేశ్ పాదయాత్రపై మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు. వైసీపీలో ఏమైనా జరిగితే, ముఖ్యమంత్రి ఎవరనే కన్య్ఫూజన్ ఉందేమో గానీ టీడీపీ అలా కాదు. లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందే వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. లోకేశ్ పాదయాత్ర చేస్తుంది చంద్రబాబును సీఎంను చేయడానికే. రాష్ట్రంలో వైసీపీ మాఫియాను తుదముట్టించడానికే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. వైసీపీకి ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే హాస్పిటల్ కు పంపాల్సిందే. వచ్చే ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబే. వస్తున్న సర్వేలు చూస్తే వైసీపీకి మైండ్ బ్లాంక్ అవుతుంది. బుల్డోజర్లు పెట్టినా కూడా వైసీపీ లేచే పరిస్థితిలేదు. సీఓవర్, ఇండియాటుడే సర్వేలో వైసీపీ ఓటు శాతం 39కు పడిపోయింది. గతంలో టీడీపీకి కూడా ఇలానే చెప్పారు. అది జరిగింది. వైసీపీ ఇంటికి పోతుందని సర్వేలో తెలిపోయింది. లోకేశ్ యువగళమే వైసీపీని ఇంటికి పంపిస్తుంది. యువగళంతో వైసీపీ పీఠాలు కదులుతున్నాయి. లోకేశ్ 400 రోజుల పాదయాత్ర ముగిస్తే వైసీపీకి 175 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా రాదు." - మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు 
 


మూడో రోజు లోకేశ్ పాదయాత్ర


మూడో రోజు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.  చిత్తూరు శాంతిపురంలో మహిళలతో నిర్వహించిన నారా లోకేశ్ ముఖాముఖిలో వారు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. పన్నులు విపరీతంగా పెంచి అమ్మ ఒడి ఇచ్చాం అంటున్నారని వాపోయారు. అమ్మ ఒడిలో అనేక సాకులు చెప్పి డబ్బులు కట్ చేసి ఇస్తున్నారని అన్నారు. ఈ ఏడాది అమ్మ ఒడి కూడా పడలేదని చెప్పారు. ‘‘నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర, కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, బస్ ఛార్జీలు ఇలా మాపై ప్రభుత్వం విపరీతంగా భారాన్ని పెంచేసింది. వచ్చే అరకొర ఆదాయంతో బతకడం కష్టంగా మారింది. డ్వాక్రా సంఘాలను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. పొదుపు సొమ్ములు కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఎంతో మంది పెన్షన్లు రద్దు చేస్తున్నారు. బయట మా సమస్యల గురించి మాట్లాడితే కేసులు పెడతాం అని బెదిరిస్తున్నా’’రంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 


వైసీపీ పాలనలో మహిళలకు భరోసా లేదు 


"మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పారు. మహిళలకు భద్రత కొరవైంది జగన్ ఎక్కడ..? నియోజకవర్గంలో ముగ్గురు యువతులపై అత్యాచారాలు జరిగాయి. వాలంటీర్లు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకూ వారిపై చర్యలు తీసుకోలేదు. జగన్ పాలనలో మహిళలకు భద్రత - భరోసా లేదు. మహిళల తాళి బొట్లు తాకట్టు పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. మద్యపాన నిషేదం తరువాత ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు. ఆఖరికి మందు బాబులను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ రెడ్డి. విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని జగన్ రెడ్డి తయారు చేస్తున్నాడు. జగన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు. ఇప్పడు అమ్మ ఒడి ఇస్తున్నారా? ఇప్పుడు ఏకంగా అరకొరగా ఇచ్చే అమ్మ ఒడి కూడా ఏడాది ఎగొట్టారు. 45 ఏళ్లకే మహిళలకు పెన్షన్ అన్నారు ఇచ్చారా..? ఎన్నికల్లో అన్ని పెంచుకుంటూ పోతా అన్నారు. అందరూ సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారు అంటుకుంటే పన్నులు పెంచారు. కరెంట్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా అన్ని పెంచుకుంటూ పోతున్నారు. దిశ చట్టం అంటూ మహిళల్ని మోసం చేశారు జగన్ రెడ్డి. 21 రోజుల్లో ఉరి శిక్ష అన్నారు. దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు, స్కూటర్లు ఉన్నాయి కానీ దిశ చట్టమే లేదు." - లోకేశ్