బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తల్లి జయ భేద చనిపోయారు. 73 సంవత్సరాల జయ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. డోమెట్రియల్ క్యాన్సర్‌తో ఆమె గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని రాఖీ సావంత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “ఈ రోజు మా అమ్మ చనిపోయింది. నేను సర్వస్వం కోల్పోయినట్లు భావిస్తున్నాను. నువ్వు నన్ను వదిలేశావు. ఇకపై నా మాట ఎవరు వింటారు? ఎవరు నన్ను హగ్ చేసుకుంటారు? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? మిస్ యు అమ్మా” అంటూ తన బాధను వెల్లగక్కింది. ఈ మేరకు హాస్పిటల్ బెడ్ పక్కన కూర్చొని ఏడుస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది.

  






జయ మృతి పట్ల బాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం


రాఖీ సావంత్ వీడియో చూసి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. జయ మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జయ మరణం పట్ల నటుడు జాకీ ష్రాప్ స్పందించారు. “మా అమ్మానాన్న, సోదరుడిని కోల్పోయిన బాధ నీలోనూ కనిపిస్తోంది. వారి ఆత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది” అని వెల్లడించారు. రాఖీ సావంత్ తల్లి మరణంపై పవిత్ర పునియా, రష్మీ దేశాయ్, రిధిమా పండిట్, అంకిత్ తివారీ, నిషా రావల్, మనయతా దత్ సహా పలువురు నటీనటులు స్పందించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. భగవంతుడు అన్ని వేళలా  రాఖీ కుటుంబానికి అండగా ఉండాలని ఆకాంక్షించారు.    


ఓషివారా మున్సిపల్ క్రిస్టియన్ స్మశాన వాటికలో అంత్యక్రియలు


ఇక రాఖీ సావంత్ తల్లి జయ భేద అంత్య క్రియలు ఇవాళ (ఆదివారం) ముంబైలో జరిగాయి.  “నా ప్రియమైన తల్లి ఆకస్మిక మరణం పొందింది. ఈ విచారకర సమయంలో మీకు ఓ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆమె కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మీలో చాలా మందికి తెలుసు. ఆమె చనిపోయిందని చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. ఆమె అంత్య క్రియలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతాయి. అంధేరి  వెస్ట్ ఓషివారాలోని మున్సిపల్ క్రిస్టియన్ స్మశాన వాటికలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం” అని తెలిపింది.   






ఎండోమెట్రియల్ క్యాన్సర్ తో జయ మృతి- దీపక్ నంజోషి


రాఖీ సావంత్ తల్లి జయ (73)  శనివారం రాత్రి 9 గంటలకు చనిపోయారని క్రిటికేర్ ఏషియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ దీపక్ నంజోషి తెలిపారు. "రాఖీ సావంత్ తల్లికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ నాల్గవ దశలో ఉంది. ఇది మెదడు, ఊపిరితిత్తులు, కాలేయానికి వ్యాపించింది. ఆమెను 15 రోజుల క్రితం హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఆమెను ఇంతకుముందు మరొక ఆసుపత్రిలో చికిత్స చేశారు. వాళ్లు ఇక్కడకు రిఫర్ చేశారు" అని డాక్టర్ వెల్లడించారు.


Read Also: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?