Cheetah Migration in Tirumala Walkway: తిరుమల (Tirumala) నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గతంలో ఓ బాలుడు, చిన్నారిపై దాడి అనంతరం.. చిరుత, అడవి జంతువుల కదలికలు గుర్తించేందుకు టీడీపీ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 25, 26 తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 కి.మీ దూరంలో చిరుత సంచారాన్ని గుర్తించినట్లు టీటీడీ అటవీ శాఖ డీఎఫ్ వో శ్రీనివాసులు వెల్లడించారు. అధునాతన కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు చిరుత కదలికలు గమనిస్తున్నామని.. ఫిబ్రవరి నెలలో చిరుత సంచారం లేదని.. ఈ నెలలో ఐదుసార్లు చిరుత కదలికలు గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు చిరుత సంచారంపై సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. కాగా, బాలిక లక్షితపై చిరుత దాడి అనంతరం ఇప్పటికే 6 చిరుతలను బోన్లలో బంధించి.. వివిధ ప్రాంతాల్లో విడిచిపెట్టారు. అయితే, మళ్లీ చిరుత కదలికలతో కాలినడక మార్గంలో భక్తులను గుంపులుగా పంపించడం సహా భద్రతా చర్యలు చేపట్టామని డీఎఫ్ వో వివరించారు. 


ఆ మార్గాల్లో..


నడక మార్గంలో చిరుత కదలికల నేపథ్యంలో సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మెట్ల మార్గం నుంచి ఏడో మైలు వరకూ, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, గాలి గోపురం వంటి ప్రాంతాల్లో జంతువులతో పాటు చిరుత సంచారం ఉన్నట్లు గుర్తించారు. చిరుత సంచరించినట్లు కెమెరాల్లో రికార్డయ్యిందని.. అయితే, పాదచారుల మార్గంలోకి చొరబడిన ఆనవాళ్లు ఏమీ లేవని అటవీ అధికారులు వివరించారు. అయినా, భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. త్వరలో సెంటర్ల వైల్డ్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతామని డీఎఫ్ వో అన్నారు. వారి సూచన మేరకు నడకదారిలో జంతువుల సంచారానికి అనువుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.


ఏప్రిల్ 2న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం


మరోవైపు, తిరుమలలో ఏప్రిల్ 2న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణ చేస్తారు. అనంతరం స్వామి వారికి నైవేద్యం, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి.. భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అటు, శ్రీక్రోధి నామ సంవత్సర పంచాగం పుస్తకాలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 27 నుంచి తిరుమల, తిరుపతి.. టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని కొనుగోలు చేయవచ్చని తెలిపింది.


Also Read: Pawan Kalyan Election Campaign: రేపట్నుంచి జనంలోకి జనసేనాని, పవన్ కళ్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల