Pawan Kalyan Election Campaign Begins from Pithapuram: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇదివరకే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 27న మేమంతా సిద్ధమంటూ బస్ యాత్రను మొదలుపెట్టారు. అదే రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు పవన్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. పిఠాపురం కేంద్రంగానే ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లనున్నారు. జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు.
పిఠాపురంలో 5 రోజులు ప్రచారం..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నారని తెలిసిందే. సొంత నియోజకవర్గం పిఠాపురంలో మార్చి 30 (శనివారం) నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ ప్రచారం చేయనున్నారు. శనివారం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు రామాలయం వద్ద పవన్ కళ్యాణ్ వారాహి విజయ భేరి బహిరంగ సభకు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు కోరారు. వారాహి వాహనం నుంచి పిఠాపురం కేంద్రంగానే పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి జనసేన నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ పిఠాపురంలో 5 రోజులు పర్యటించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు సొంత నియోజకవర్గంలో పవన్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 3న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలిలో పవన్ ప్రచారం చేస్తారు. తొలి విడతలోనే అనకాపల్లి, కాకినాడ రూరల్ లో పవన్ క్యాంపెయిన్ చేయనున్నారు. ఏప్రిల్ 9న మరోసారి పిఠాపురంలో పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేశారు.
పవన్ తొలి విడత ప్రచార షెడ్యూల్
మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పిఠాపురం
ఏప్రిల్ 3 - తెనాలి
ఏప్రిల్ 4 - నెల్లిమర్ల
ఏప్రిల్ 5 - అనకాపల్లి
ఏప్రిల్ 6 - యలమంచిలి
ఏప్రిల్ 7 - పెందుర్తి
ఏప్రిల్ 8 - కాకినాడ రూరల్
ఏప్రిల్ 10 - రాజోలు
ఏప్రిల్ 11 - పి.గన్నవరం
ఏప్రిల్ 12 - రాజా నగరం
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఏపీలో ఎన్నికలకు వెళ్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తోంది. వైనాట్ 175 అని ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మార్చి 16న దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని.. ఎవరైనా ప్రచారం చేశారని గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు.