Raghurama Will Contest From NDA alliance  :  నర్సాపరం ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ పై గత నాలుగున్నరేళ్లుగా పోరాడుతున్నారు. అయితే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీ తరపున అవకాశం లభించలేదు. కూటమిలో భాగంగా ఏ పార్టీకి సీటు వస్తే ఆ పార్టీ తరపున పోటీ చేస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. బీజేపీకి నర్సాపురం సీటు దక్కనిప్పటికీ ఆయనకు మాత్రం సీటు ఇవ్వలేదు.. భూపతిరాజు శ్రీనివాస వర్మ అనే బీజేపీ నేతలకు సీటు కేటాయించారు. దీంతో రఘురామ  రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ పార్టీల మధ్య కూడా రఘురామ పోటీ అంశం తాజా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 


వైసీపీ అరాచకాలపై సీఎం జగన్ పాలనపై పోరాడిన రఘురామకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం మంచిది కాదన్న  భావన  మూడు పార్టీల నేతల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే తాజాగా రఘురామను పోటీకి నిలిపే అంశంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనను పార్లమెంట్ లేదా అసెంబ్లీ కి పోటీకి పరిశీలన జరుపుతున్నారు. రఘురామకృష్ణరాజు తాను నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేయబోతున్నానని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీ  చేసే అవకాశాలు ఉన్నాయన్న గుసగుసలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి. తెర వెనుక జరుగుతున్న రాజకీయాలేమిటో మాత్రం క్లారిటీ రావడం లేదు.         


ఏపీలో అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేశాయి కానీ.. బీఫాంలు ఇవ్వలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతనే ఫైనల్ గా అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అప్పటి వరకూ ఎవరికీ  సీటు కన్ఫర్మ్ కాదు. కానీ ప్రచారాలు మాత్రం చేసుకుంటూ ఉంటారు. నర్సాపురం సీటు పొందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కన్నా రఘురామకృష్ణరాజే గట్టి అభ్యర్థి అవుతారన్న ప్రచారం ఉంది. ఈ విషయంపై హైకమాండ్‌కు  బీజేపీ రాష్ట్ర నేతలు  ప్రత్యేక వినతి  పత్రం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వైసీపీ తరపున బలమైన అభ్యర్థిని  కూడా నిలబెట్టకపోవడం వల్ల...రఘురామ సులువుగా భారీ మెజార్టీతో గెలుస్తాడని భావిస్తున్నారు.             


ఒక వేళ రఘురామకు పార్లమెంట్ సీటు ఇవ్వలేకపోతే ఆయనకు అసెంబ్లీ సీటు సర్దవచ్చని అంచనా వేస్తున్నారు.  పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి సీటు విషయంలో రఘురామ పేరు వినిపిస్తోంది. అక్కడ టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరును ఖరారు చేశారు. కానీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ  తనకే చాన్సివ్వాలంటున్నారు. లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నారు. వీరిద్దరూ రఘురామకృష్ణరాజుకు సన్నిహితులే. వారిద్దరి మధ్య పంచాయతీ తీర్చడానికి .. రఘురామకు చాన్సిచ్చి అసెంబ్లీకి వచ్చేలా చూసినా.. జగన్ పై ఆయన పోరాటానికి తగిన ప్రతిఫలం ఇచ్చినట్లేనని భావిస్తున్నారు. జగన్ ను ఓడించాలని.. గట్టిగా పోరాడిన వ్యక్తి రఘురామ ఎన్నికల పోటీలో లేకపోతే.. లోటు స్పష్టంగా ఉంటుంది కూటమి నేతలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.