Chandrababu :  టీటీడీ చైర్మన్, వైఎస్ఆర్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల ప్రధానాధికారికి చంద్రబాబు మరోసారి లేఖ రాశారు.   ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రోజైన ఈ నెల 13వ తేదిన స్థానికేత‌రుడైన , టిటిడి ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి విశాఖ‌ప‌ట్నంలో పోలింగ్ బూత్ ల‌ను సంద‌ర్శించ‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ టిడిపి అధినేత ఎపి ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి ఇంతకు ముందే ఫిర్యాదు చేశారు.  దీనికి ఈసి స్పందిస్తూ, ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి ఫ్లయింగ్ స్క్వాడ్, తహసీల్దార్, ఎస్ఐలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.           

                                          


అయితే అధికారుల‌తో పాటు వైవి సుబ్బారెడ్డిపైనా త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాలంటూ చంద్ర‌బాబు మ‌రో లేఖ రాశారు. వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల నియమావళిని అతిక్రమించారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ స్థానికేతరుడైన సుబ్బారెడ్డికి విశాఖలో ఏం పని? అని మండిపడ్డారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా విశాఖ‌లో ప‌ర్య‌టించిన సుబ్బారెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందేన‌ని ఈసిని చంద్ర‌బాబు కోరారు..           

        


శుక్రవారం కూడా చంద్రబాబు సీఈవోకు ఓ లేఖ రాశారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‎ సెంటర్స్‎లో భద్రత పెంచడంతో పాటు.. నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని లేఖలో  పేర్కొన్నారు. అనంతపురం   కౌంటింగ్ సెంటర్‎లో వైసీపీ రౌడీల చొరబాటు ఘటనను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. లేఖలో..‘‘ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అధికార వైసీపీ అక్రమాలు, ఉల్లంఘనలకు పాల్పడుతోంది. వైసీపీ మూకలు అక్రమ పద్దతుల ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురంలోని పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు ప్రయత్నించారని లేఖలో పేర్కొన్నారు.                                                


ఓటమిని నుంచి బయటపడడానికి వైసీపీ నేతలు కౌంటింగ్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇలాంటి అక్రమాలు వైఎస్‌ఆర్‌సీపీ గూండాలకు అలవాటుగా మారాయని చంద్రబాబు మండిపడ్డారు.  అధికార వైఎస్సార్‌సీపీ ఒత్తిడి కారణంగా ఎన్నికల సిబ్బంది చట్ట ప్రకారం విధులు నిర్వర్తించలేకపోతున్నారని విమర్శించారు. అందుకే  మూడు పట్టభద్రుల నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల్లో తక్షణమే భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నానని..ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చూడాలి. టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ ధనంజయరెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేసి.. కౌంటింగ్ హాల్‎లో రభస సృష్టించిన దోషులను అరెస్టు చేయాలి. ఈ మేరకు మీరు పోలీసులను, స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరారు.