ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతోందని, ప్రభుత్వం చేసే ఈ ఉగ్రవాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశామని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం రాష్ట్రపతిని కలిసిన అనంతరం రాష్ట్రపతి భవన్ ఎదుట చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని కోరినట్లుగా చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు కనుక చేయకపోతే.. రాష్ట్రంలోని డ్రగ్స్ మాఫియా ఇతర రాష్ట్రాల్లోనూ పేట్రేగుతుందని చెప్పినట్లు వివరించారు. టీడీపీ ఆఫీసులపై దాడుల కేసును సీబీఐకి అప్పగించి దోషులకు కఠిన శిక్షలు జరిపించాలని కోరామని అన్నారు.


Also Read: APSRTC: ఆర్టీసీలో ఇకపై డొక్కు బస్సులే ఉండవు.. పనులు ఊపందుకున్నాయి


ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో మన్యం ప్రాంతంలో ఏకంగా 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీని విలువ రూ.8 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా.. అందుకు ఏపీతో సంబంధం ఉంటోందని ఆరోపించారు. తెలంగాణ, యూపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుకున్నా.. ఏపీకి సంబంధం ఉంటుందని అక్కడి పోలీసులే చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. 


Also Read: టీడీపీ వర్సెస్ వల్లభనేని వంశీ... నేతల మధ్య ట్వీట్ వార్


మాదకద్రవ్యాలకు కేంద్రంగా ఏపీ
‘‘ఇటీవల ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్ల విలువ చేసే 3 వేల కిలోల హెరాయిన్ పట్టుకున్నారు. దానికి మూలాన్ని కూపీ లాగితే విజయవాడ సత్యనారాయణ పురం అని పోలీసులు గుర్తించారు. నర్సాపురం నుంచి డ్రగ్స్ పెట్టి ఆస్ట్రేలియాకు పంపే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డా దానికి మూలం ఏపీ అని బయటపడుతోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక.. ఏపీలో కొత్త లిక్కర్ బ్రాండ్స్‌ను ప్రవేశపెట్టారు. ఇవి మరెక్కడా కనిపించవు. ఆ బ్రాండ్స్ అన్నింటినీ వీళ్ల మనుషులు మాఫియానే చేస్తోంది. ఎక్కడ లెక్కలు లేకుండా చేస్తున్నారు. తొలుత మద్యపాన నిషేధం అని.. మూడు రెట్లు రేట్లు పెంచి సొంత బ్రాండ్లతో సొంత వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది తాగితే అనారోగ్యం అని పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ తెప్పించుకుంటున్నారు. ఈ ధరలు భరించలేక డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతున్నారు.


Also Read: వైఎస్ఆర్సీపీ ఉగ్రదాడి చేసింది... పోలీసులు దగ్గరుండి మరీ దాడి చేయించారు... వైసీపీపై చంద్రబాబు ఫైర్


డ్రగ్స్‌లో నెంబర్ 1
‘‘ఇటీవలి కాలంలో డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ కోసం తెలుగు దేశం పార్టీ పోరాడుతోంది. యువత దాని బారిన పడకుండా జాతి నిర్వీర్యం కాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నాం. డ్రగ్స్ మాఫియా అంటే చివరకు ఉగ్రవాదులకు నిధులు వెళ్తాయి. గతంలో ఏపీ అంటే అనేక విషయాల్లో నెంబర్ 1 పరిస్థితి ఉండేది. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో తొలిస్థానంలో ఉంది. దీనిపై ఆరోపణలు చేసినందుకు రాష్ట్రం మొత్తం ఒకేసారి టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. డీజీపీ స్పందించలేదు. ఎవరూ ఫోనెత్తరు. పోలీసులే దగ్గరుండి చేశారంటే.. ఇది ప్రభుత్వ ఉగ్రవాదం తప్ప మరొకటి కాదు.’’


‘‘రాష్ట్రంలో ఉన్మాది పాలన సాగుతోంది. ఇసుక మాఫియా, ఖనిజ సంపద మాఫియా, భూముల విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం రాష్ట్ర సంపదను దోచుకొని రాజ్యాంగ వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఎన్నికల కమిషనర్‌పైనా దాడి చేశారు. హైకోర్టు జడ్జిలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు ప్రచారం చేశారు. అన్ని రాజ్యాంగ సంస్థలపైనా దాడి చేశారు. 2430 జీవో తీసుకొచ్చి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మీడియాపై కేసులు పెట్టే స్థితికి వచ్చారు. రాష్ట్రంలో అన్ని రకాల దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తున్న ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీపై ఇష్టమొచ్చినట్లుగా దాడులు చేస్తున్నారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.’’ అని చంద్రబాబు ఆరోపించారు.


డీజీపీని తొలగించాల్సిందే..
ఏపీ డీజీపీ ముఖ్యమంత్రితో కలిసి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంలో భాగస్వాములయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ఆయన్ను పదవి నుంచి తప్పించాలని రాష్ట్రపతిని కోరినట్లు వివరించారు. పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించి.. ఏకపక్ష అరెస్టులు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేదా అని నిలదీశారు. డీజీపీని పదవి నుంచి తప్పించడమే కాకుండా.. ఆయనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. తన పరంగా అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకుంటానని రాష్ట్రపతి చెప్పినట్లుగా చంద్రబాబు వివరించారు.


Also Read:  టీడీపీ గుర్తింపు రద్దుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం... వైసీపీ నేత సజ్జల కామెంట్స్.. ఏపీలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి