Chandrababu Comments in Rajamundry: రాష్ట్రంలో ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఖాళీ అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాజమండ్రి(Rajamundry)లో సోమవారం నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైసీపీలో తిరుగుబాటు మొదలైందని.. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలంతా భయపడతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. వైసీపీని గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని.. త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.


‘అదే వారికి చివరి రోజు’


వైసీపీ నేతలు నడిరోడ్డుపైనే మహిళలను వేధిస్తున్నారని.. వారి జోలికి వస్తే వైసీపీకి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల కోసం వైసీపీ నేతల మాటలు భరిస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని.. ఆ ఉన్మాది పాలనలో అందరం బాధితులమేనని చెప్పారు. సీఎం జగన్ అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. ‘ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నారు. ఆకు కూరలు దొరకడం లేదు కానీ రాష్ట్రమంతా గంజాయి దొరుకుతుంది. దానికి బానిసల్ని చేసి యువత భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


‘వారి గొంతు నొక్కుతున్నారు’


సీఎం జగన్ చెప్పేవన్నీ నీతులని.. చేసేవన్నీ సైకో పనులని చంద్రబాబు దుయ్యబట్టారు. దళితులెవరైనా ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నాలుగున్నరేళ్లలో 6 వేల దాడులు చేశారని.. 188 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ‘మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ను పిచ్చోణ్ని చేసి చంపారు. కోడికత్తి శ్రీని ఐదేళ్ల నుంచి జైలులో ఉన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా.?’ అని ప్రశ్నించారు. పన్నుల బాదుడుతో జగన్ పేదల రక్తం తాగుతున్నారని.. ప్రభుత్వంలో 9 సార్లు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీని భూ స్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


చంద్రబాబుకు తప్పిన ప్రమాదం


అటు, రాజమండ్రి కాతేరు 'రా.. కదలిరా' సభలో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. ఆయన వేదికపై నుంచి కింద పడబోగా వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను పట్టుకున్నారు. రాజానగరం (Rajanagaram) టికెట్ ను జనసేనకు కేటాయించడంపై బొడ్డు వెంకటరమణ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. స్టేజ్ పై నుంచి చంద్రబాబు దిగుతుండగా.. కార్యకర్తలు దూకుడుగా దిగడంతో ఆయన తూలి కింద పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను పట్టుకున్నారు. కార్యకర్తల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయమనం పాటించాలని సూచించారు. రాజానగరం అసెంబ్లీ స్థానంలో టీడీపీయే పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అయితే, ఈ విషయమై కార్యకర్తలకు చంద్రబాబు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. వీరికి పార్టీ సీనియర్లు కూడా సర్ధిచెప్పేందుకు యత్నించారు. వెంకటరమణ వర్గీయులు స్టేజీపై ఒక్కసారిగా తోసుకువచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూకుడుగా దిగడంతో చంద్రబాబు పట్టు తప్పి కింద పడబోయారు.


Also Read: TTD: టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం - ఉద్యోగులకు పాలకమండలి గుడ్ న్యూస్