TTD Governing Council Approved Annual Budget 2024: ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులను స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ రూ.15 వేల జీతాలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు 2024 - 25 ఏడాదికి సంబంధించి రూ.5,141 కోట్ల అంచనాతో రూపొందించిన వార్షిక బడ్జెట్ కు పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలి నిర్ణయాలను ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ.35 వేల నుంచి రూ.54 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.


మరిన్ని నిర్ణయాలు



  • టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, దేవస్థానం పరిధిలోకి తీసుకున్న  34 ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి

  • ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్ల తరహాలో మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులో తేవాలని నిర్ణయం. వీటిని శ్రీవారి పాదాల చెంత ఉంచి.. అనంతరం కొత్తగా పెళ్లైన జంటలకు అందించేందుకు నిర్ణయం

  • వేద పాఠశాలలో ఉద్యోగుల జీతాలు పెంపునకు నిర్ణయం

  • వాటర్ వర్క్స్ తో పాటు అన్న ప్రసాదం, టీటీడీ స్టోర్స్ లో పని చేస్తోన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపు

  • రూ.30 కోట్ల వ్యయంతో గోగర్భం నుంచి ఆకాశగంగ వరకూ 4 వరుసల నిర్మాణం చేసేందుకు అనుమతి

  • నారాయణవనంలో వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.6.9 కోట్ల కేటాయింపుతో పాటు స్విమ్స్ అభివృద్ధి పనుల కోసం రూ.149 కోట్ల కేటాయింపు

  • సప్తగిరి అతిథి గృహాల అభివృద్ధి పనులకు రూ.2.5 కోట్ల కేటాయింపు

  • ఎస్ఎంసీ, ఎస్ఎస్సీ కాటేజీల అభివృద్ధి పనుల కోసం రూ.10 కోట్ల కేటాయింపు

  • వేద పండితుల పెన్షన్ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ నిర్ణయం

  • టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో విధులు నిర్వర్తిస్తోన్న అర్చకుల జీతాల పెంపుతో పాటు 56 వేదపారాయణదారుల పోస్టుల నియామకానికి నిర్ణయం

  • టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకరించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ టీటీడీ తీర్మానం చేసింది.


ధార్మిక సదస్సు


ఇక, ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకూ ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సదస్సుకు హాజరవుతారని.. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలను తప్పక పాటిస్తామని చెప్పారు.


ఆదాయం అంచనాలు


శ్రీవారి హుండీ ఆదాయం రూ.1611 కోట్లుగా టీటీడీ అంచనా వేసింది. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల ద్వారా రూ.1167 కోట్ల రాబడి, ఇతర పెట్టుబడుల ద్వారా రూ.129 కోట్ల ఆదాయం, శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల ద్వారా రూ.448 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.600 కోట్లు, కల్యాణకట్టల రశీదుల ద్వారా రూ.151.50 కోట్లు, గదులు, కల్యాణమండపం బాడుగల ద్వారా రూ.147 కోట్లు ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు.


వార్షిక బడ్జెట్ కేటాయింపులు


2024 - 25 ఏడాదికి రూ.5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించగా.. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1733 కోట్లు, నిత్యవసరాల కొనుగోళ్లకు రూ.751 కోట్ల కార్పస్ ఫండ్, ఇతర పెట్టుబడులకు రూ.750 కోట్లు, ఇంజినీరింగ్ పనులకు రూ.350 కోట్లు, శ్రీనివాస సైతు ఫ్లై ఓవర్ కు రూ.53 కోట్లు, స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి పనులకు రూ.60 కోట్లు, ఇంజినీరింగ్ మెయింటెనెన్స్ పనులకు రూ.190 కోట్లు కేటాయించారు. అలాగే, వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం రూపంలో రూ.50 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలు, వివిధ వర్శిటీలకు గ్రాంట్స్ రూ.173.31 కోట్లు, పారిశుద్ధ్య విభాగానికి రూ.261.07 కోట్లు, నిఘా, భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు, వైద్య విభాగానికి రూ.241.07 కోట్లుగా కేటాయించారు. సాధారణంగా టీటీడీ వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఆమోదిస్తుంటారు. అయితే, త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావొచ్చనే అంచనాల నేపథ్యంలో ఈసారి జనవరిలోనే వార్షిక బడ్జెట్ కు టీటీడీ పాలకమండలి ఆమోదించింది.


Also Read: IRR Case: IRR కేసులో చంద్రబాబుకు ఊరట - బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ