Chandrababu reminisced with Ramoji Rao: 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అయితే, ఈ పేరు వెనుక ఉన్నది మీడియా దిగ్గజం రామోజీరావే. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే ఓ సభలో వెల్లడించారు. 'ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే, రామోజీరావు గారు పరిశోధన చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 'అమరావతి' పేరు బాగుంటుంది అని చెప్తే, అందరి అభిప్రాయం తీసుకుని, "అమరావతి" అని మన రాజధాని పేరు పెట్టుకున్నాం' అంటూ చంద్రబాబు గతంలో ఓ సభలో గుర్తు చేసుకున్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు. ఇప్పుడు 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో మళ్లీ అమరావతి అభివృద్ధి ఊపందుకుంటుందని అంతా భావిస్తున్నారు. 


ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి


అక్షరయోధుడు, మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణంపై రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించామని.. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు అని.. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని పేర్కొన్నారు. మంచిని మంచిగా.. చెడును చెడుగా చెప్పే ఆయన తీరు.. తనను ఆయనకు దగ్గర చేసిందని అన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 


హైదరాబాద్‌కు చంద్రబాబు


ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. రామోజీరావు మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆయన పార్థీవదేహాన్ని చూసేందుకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఆయన రామోజీ ఫిల్మ్ సిటీకి రానున్నారు.