Chandrababu : కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభ ప్రారంభించుకోవడం దేశానికి గర్వకారణం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ చారిత్రక నిర్మాణంలో పాలు పంచుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనంలో దేశానికి మలుపుతిప్పే నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదరికం లేని దేశం నిర్మూలన దిశగా అడుగులు పడతాయని.. దనికులు, పేదలమధ్య అంతరం తగ్గిపోవాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లయిన సందర్భంగా 2047 కల్లా దీన్ని సాధించాలన్నారు.
చంద్రబాబు తన సోషల్ మీడియా స్పందనలో .. ఎక్కడా ప్రస్తుతం జరుగుతున్న వివాదంపై స్పందించ లేదు. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని ప్రధాని మోదీ కాదని విపక్షాలు అంటున్నాయి. ఈ కారణంతోనే ప్రారంభోత్సవానికి రాకుండా బహిష్కరించాలని నిర్ణయించాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వివాదంపై ట్వీట్ చేశారు. ఇలా బహిష్కరించడం పద్దతి కాదని ఆయా విపక్షాలకు హితవు పలికారు., చంద్రబాబు మాత్రం ఈ అంశంపై స్పందించలేదు. తన ట్వీట్‌లో.. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి టీడీపీ హాజరవుతుందా లేదా అన్నది ఆయన చెప్పలేదు కానీ తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం హాజరవుతారని అంటున్నారు.
మే 28న ప్రారంభం..
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించనున్నారు. కొత్త పార్లమెంట్ సిద్ధమైపోయిందని, ఆత్మనిర్భర్ భారత్‌కి ఇది ప్రతీకగా నిలిచిపోతుందని గతవారమే లోక్‌సభ ఓ ప్రకటన చేసింది. 2020 డిసెంబర్ 10వ తేదీన ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మోదీ. అయితే...కొవిడ్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. 2021 జనవరిలో నిర్మాణం మొదలైంది. అహ్మదాబాద్‌కి చెందిన HCP Design Planning and Management ఈ బిల్డింగ్‌ని డిజైన్ చేసింది. ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ (Bimal Patel)దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ పక్కనే Tata Projects Limited ఈ నిర్మాణాన్ని చేసింది.
పాత పార్లమెంట్‌లో లోక్‌సభలో 543 మంది, రాజ్యసభలో 250 మంది కూర్చునేందుకు వీలుండేది. అయితే..కొత్త పార్లమెంట్‌లో సీటింగ్ కెపాసిటీ పెంచారు. 888 మంది లోక్‌సభలో, 300 మంది రాజ్యసభలో కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. పాత భవనం డయామీటర్ 560 అడుగులు. అది కేవలం 24,281 చదరపు మీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. ఇప్పుడీ విస్తీర్ణాన్ని భారీగా పెంచారు. ప్రస్తుత పార్లమెంట్‌లో సెంట్రల్ హాల్ ఉంది. ఇందులోనే మీటింగ్‌లు జరిగేవి. అయితే...కొత్త పార్లమెంట్‌లో మాత్రం ఈ వసతి లేదు. లోక్‌సభ ఛాంబర్‌లోనే జాయింట్ సెషన్స్ ఏర్పాటు చేసుకునేలా మార్పులు చేర్పులు చేశారు.