GVL On Avinash : అవినాష్ రెడ్డిని సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని  సీబీఐ చేతకాని సంస్థగా భావిస్తున్నారా అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. సీబీఐ నిర్ణయం తీసుకుంటే ఏ స్థాయికి అయినా వెళుతుందన్నారు.  రౌడీయిజం చేసి అడ్డుకోవడం సాధ్యం కాదు... సీబీఐ వంటి సంస్థలను ఏ శక్తి  ఆపలేదని స్పష్టం చేశారు.  రాజకీయ వ్యాఖ్యానాలు చేసి అభాసుపాలు కావొద్దని  సలహా ఇచ్చారు.  తాటాకు చప్పుళ్ళకు భయపడే సంస్థ సీబీఐ కాదు.. తోక పార్టీలు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ వంటి సంస్థలు చేస్తున్న దర్యాప్తును ఏ శక్తి ఆపలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ నిర్ణయం తీసుకుంటే ఏ స్థాయికైనా వెళ్తుందని చెప్పారు. 


ఏపీపై అభిమానంతోనే మోదీ నిధులు మంజూరు చేశారు !                   


రెవెన్యూ డెఫిషీట్ గ్రాంట్ ద్వారా రూ. 10వేల 400 కోట్లు ఇచ్చి ఏపీ మీద తనకు ఉన్న అభిమానాన్ని మోడీ చాటుకున్నారని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు అని అడగడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందన్నారు. ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం అంటే ప్రజా సంక్షేమం కోసమే తప్ప అనవసర నిందలు వేయడం సరైనది కాదన్నారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున పడేయాలనే అభిప్రాయంతో మాట్లాడటం సరైన విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు నిధులు ఇస్తే లాభాపేక్ష ఆశించి చేస్తున్నారని నిందలు వేయడం దారుణమన్నారు. స్పెషల్ స్టేటస్ వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుందో అంత కంటే ఎక్కువ నిధులు వచ్చాయని ఈ సందర్భంగా జీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు.


నిధులు ఇస్తే ఏ రాజకీయ పార్టీకో ఎందుకు మేలు జరుగుతుంది ?                                     
  
ఏపి అభివృద్ధి కి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ఉపాధి హమీ పథకం కింద  దేశంలోనే అత్యధికంగా 55వేల కోట్లు తీసుకున్న రెండో రాష్ట్రం ఏపీ అని గుర్తు చేశారు.  వైసీపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు.  నిధులు ఇవ్వడం ద్వారా ఏ రాజకీయ పార్టీకో మేలు జరుగుతుందనే అంచనాలతో విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవంను బాయ్ కట్  చేసే పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోతాయని జీవీఎల్ హెచ్చరించారు. 


బీజేపీపై విమర్శలు సరి కాదన్న జీవీఎల్                                                        


రాష్ట్ర విభజన నాటి లోటు భర్తీ నిధులను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. ఇలా విడుదల చేయడంపై సోషల్ మీడియాలో భిన్నమైన ప్రచారం  జరుగుతోంది. అప్పటి నిధలు ఇప్పుడు ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వాన్ని గట్టున పడేయడానికి ఇచ్చారని అంటున్నారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి కేసు విషయంలో ఓ అదృశ్య శక్తి .. జోక్యం చేసుకుంటోందని అందుకే అరెస్ట్ చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు జీవీఎల్ నరసింహారావు కౌంటర్ ఇచ్చారు.