Chandrababu : ఏపీ నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు. ఆయన గత మూడు నాలుగు రోజులుగా బ్రో సినిమాను టార్గెట్ చేసుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వైసీపీ పాలనలో ప్రాజెక్టులు పడకేశాయని పర్యటనలు చేస్తున్న చంద్రబాబు అంబటి రాంబాబు తీరుపై స్పందించారు. కడప జిల్లా, కొండాపురం మండలం తిమ్మాపురం చేరుకున్నారు. అక్కడ సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై - యుద్ధభేరి పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుపై విమర్శలు గుప్పించారు. తాను ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ‘బ్రో’ సినిమా గురుంచి మాట్లాడతారని చంద్రబాబు సెటైర్లు వేశారు.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై - యుద్ధభేరి.. ప్రజల్లో చైతన్యం కోసం పెట్టుకున్నామని, ప్రజలకు ఎవరెవరు ఏమి చేశారు... ఎవరివల్ల నష్టం జరిగిందో తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవన్నీ చూశాక కలత చెందానని.. రాష్ట్రంలో అనాగరికంగా విధ్వంసం చేశారని, చరిత్ర సృష్టించిన గండికోట... విర్రవీగుతున్న నేత సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రాంతంలోనే మీటింగ్ పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. నీటికోసం యుద్ధాలు జరిగాయన్నారు. కడప జిల్లాకు పెద్ద అసెట్ గండికోట.. బెస్ట్ టూరిజం హాబ్ గండికోట... చాలా బ్రాహ్మాండంగా అభివృద్ధి చేశానన్నారు. అలాగే ఒంటిమిట్టను అభివృద్ధి చేశానని, ఎయిర్ పోర్టును ఆధునీకరించానని చెప్పారు.
సీఎం జగన్ తన మనుషుల కాంట్రాక్టుల కోసం రూ. 5 వేల కోట్లు దోపిడీకి శ్రీకారం చుట్టారని చంద్రబాబు విమర్శించారు. అవుకు టన్నెల్ ద్వారా నీళ్లు రాకపోతే గండికోటకు నీళ్లు రావని, కడప జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఇసుక మాఫియా వల్ల ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. ప్రాజెక్టుల దగ్గర నిద్ర పోయానని, అవుకు తోటపల్లి దగ్గర ఐదేళ్లు టెండర్లు పిలవద్దని చెప్పిన మిమ్మల్ని ఏమనాలన్నారు. పెద్దిరెడ్డి కోసం ప్రాజెక్టులు.. మంత్రులే కాంట్రాక్టర్లు... అవసరం లేని పనులు చేస్తున్నారు... డబ్బులు ఇస్తున్నారు.. జగన్ అసమర్ధత వల్ల ప్రాజెక్టు, ఆస్తులు, ప్రాణాలు పోయాయన్నారు. బ్రాహ్మణి ప్రాజెక్టు ఏమి అయ్యిందని ప్రశ్నించారు. కడప జిల్లా యువత కోసం స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ వేశామని, జగన్ వచ్చాక ఆ స్థలం వదిలిపెట్టి ఇంకో చోట శంఖుస్థాపన చేశారన్నారు. కర్నూలు ఎయిర్ పోర్టును తాను ప్రారంభం చేస్తే.. దాన్ని కొట్టివేసి సీఎం తన పేరు వేసుకున్నారని, ఎవరికో పుట్టిన బిడ్డకు... నేనే తండ్రి అన్నట్లుగా వుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
గోదావరి, కృష్ణా, పెన్నా పుణ్యనదులు అనుసంధానం చేస్తే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవచ్చునని చంద్రబాబు అన్నారు. గోదావరి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వరకు అనుసంధానం అవుతాయన్నారు. రాయలసీమను ఆదుకున్నది కృష్ణదేవరాయలని.. తర్వాత తెలుగుదేశమేనని అన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే రాయలసీమకు నీటిఎద్దడి ఎదురయ్యేది కాదన్నారు. రాయలసీమను రతనాల సీమను చేయడం కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తామన్నారు.