తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహానాడు తొలి రోజు సమావేశాల చివర్లో ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమిటీ తరఫున మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రకటించారు. దాంతో చంద్రబాబు 14వ సారి టీడీపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. కాలువ శ్రీనివాసులు ప్రకటనతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. అనంతరం చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కాలువ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించారు.
టీడీపీ జాతీయ అధ్యక్ష పదవికి నేటి ఉదయం 10 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను పరిశీలించారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. అనంతరం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైనట్లు కాలువ శ్రీనివాసులు ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, ఫరూక్ ఎన్నికల పర్యవేక్షకులుగా ఉన్నారు. మొత్తం 11 మంది చంద్రబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లు తెలుస్తోంది. రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
'ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధంగా ఉంది'
తెలంగాణలో చేసిన పనుల వల్ల, టీడీపీ వేసిన ఫౌండేషన్ వల్ల ఆ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థాయికి చేరే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఈ నాలుగేళ్లలో వైసీపీ హయాంలో చేసిన విధ్వంసం వల్ల ఏపీ చివరికి వెళ్లే పరిస్థితి వచ్చిందని బాబు విమర్శించారు. 'మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత, అన్ని రాష్ట్రాలతో సమానంగా, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకటీ, రెండూ స్థానాల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తాం. ఆ శక్తి, సత్తా తెలుగుదేశానికి ఉంది. రేపు రాజమహేంద్రవరం దద్దరిల్లిపోతుంది. రాష్ట్రంలోని అన్ని చూపులు రాజమహేంద్రవరం వైపే ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధంగా ఉంది' అని బాబు అన్నారు.
'కౌరవులను వధించి అసెంబ్లీని గౌరవ సభ చేస్తాం'
ప్రజలతో అనుసంధానం కావాలని, పేద వారితో మమేకం కావాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్రను కూడా విజయవంతం చేస్తున్నారని అన్నారు. యువగళం పాదయాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల పనితనాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో అజాగ్రత్త పనికిరాదని సూచించారు. నౌ ఆర్ నెవర్ అనేలా.. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా అనేది ప్రధానమన్నారు. ఈ రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యతను అందరం తీసుకోవాలని బాబు పిలుపునిచ్చారు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను వధించి, అసెంబ్లీని గౌరవ సభ చేస్తామని అప్పటి వరకు అసెంబ్లీకి వెళ్లబోనని మరోసారి చెప్పుకొచ్చారు.
Also Read: Chandrababu: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధం- అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతాం: చంద్రబాబు