Chandrababu Comments In NDA Allinace Meeting: అధికారంలోకి వచ్చినా తాము సామాన్యులుగానే ఉంటామని.. రాష్ట్రంలో ఏ ఒక్కరి హక్కులకు భంగం వాటిల్లదని ఎన్డీయే కూటమి శానససభాపక్ష నేత చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. మాకు హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదని అన్నారు. తమకు సేవ చేసేందుకే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని.. వినయంగా ఉండాలని.. విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. సీఎం వస్తున్నాడంటే గతంలో మాదిరిగా ట్రాఫిక్ ఆపడం, రోడ్లు మూసేయడం, చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టుకోవడం, షాపులు బంద్ చేయడం వంటివి ఇక ఉండవని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా మామూలు మనిషేనని.. సాధారణ వ్యక్తిగానే జనంలోకి వస్తానని అన్నారు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పారు.
'ఆ బాధ్యత మాపై ఉంది'
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని.. వారు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు. 'ఎన్నికల్లో నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పని చేశారు. 93 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదు. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 1994లో వన్ సైడ్ ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు రాలేదు. ఇప్పుడు 175కు 164 స్థానాల్లో విజయం సాధించాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కడపలో 7కి 5 గెలిచాం. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 గెలుచుకుంది. ప్రజల తీర్పుతో ఢిల్లీలో రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది. పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిన ఎప్పటికీ మరిచిపోలేను. నేను జైలులో ఉన్నప్పుడు ఆయన వచ్చి నన్ను పరామర్శించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం. టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా పని చేసి చారిత్రాత్మక విజయం సాధించాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
'కేంద్రం హామీ'
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అవసరమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర నేతలు చెప్పారని పేర్కొన్నారు. 'మీ అందరి సహకారంతో బుధవారం నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నా. ఈసారి ప్రత్యేకం. కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారు. ప్రజలు మనకు పవిత్రమైన బాధ్యతను ఇచ్చారు. సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కేంద్ర సహకారంతో అందరి సమష్టి కృషితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.