పరిమితికి మించి ఆంధ్రప్రదేశ్ రూ.17,924 కోట్ల రుణాలు పొందిందని.. కేంద్రం తెలిపింది. ఈ కారణంగా.. వచ్చే మూడేళ్లలో రుణాలు తీసుకునే అంశంపై ఆంక్షలు ఉన్నాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు... ఎంపీలు కేశినేని, రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సమాధానం ఇచ్చింది. ఎక్కువగా ఇచ్చిన రుణాలను.. మూడేళ్లలో సర్దుబాటు చేసుకునేలా ఏపీకి ఛాన్స్ ఇచ్చామని తెలిపింది. మరో విషయం ఏంటంటే.. ఎఫ్ఆర్‌బీఎం కన్నా తక్కువ రుణాలు తీసుకోవాలని ఆంక్షలు కూడా విధించినట్లు స్పష్టం చేసింది.
భారత్ లో నీటి కొరతను ఎదుర్కొంటున్న 256 జిల్లాల్లో జల సంరక్షణ, జల వనరుల నిర్వహణను ప్రోత్సహించేందుకు జలశక్తి అభియాన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏపీ నుంచి 9 జిల్లాలను జలశక్తి అభియాన్ కింద ఎంపిక చేసినట్టు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ కడప జిల్లాలు ఇందులో ఉన్నాయి. జలశక్తి అభియాన్ లో భాగంగా చేపట్టే కార్యక్రమాల్లో.. కేంద్ర ప్రభుత్వ అధికారులు, భూగర్భజల నిపుణులు, శాస్త్రవేత్తలు, రాష్ట్ర, జిల్లాల అధికారులు కలిపి పని చేయాల్సి ఉంటుందని.. వివరించింది. వర్షపు నీటినివడిసి పట్టాలి అనే నినాదంతో జల శక్తి అభియాన్ ప్రారంభమైందని.. ఈ మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటిని వడిసి పట్టేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టనున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. దీంట్లో భాగంగా చేసిన పనుల గురించి కేంద్రమంత్రి చెప్పారు.
గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో జాప్యంపై రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్న అడిగారు. కరోనా కారణంగా.. కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగిందని.. కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది. సహజవాయువు పైప్ లైన్ నిర్మాణానికి పెట్రోలియం, నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు 2014 జులై 16న ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌ను అనుమతించిందని తెలిపింది. కాకినాడ-వైజాగ్ సెక్షన్‌ను 2021 జూన్ 30 లోపు, వైజాగ్-శ్రీకాకుళం సెక్షన్‌ను 2022 జూన్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కొవిడ్ కారణంగా.. నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు.