Vizag Steel Plant Merge In SAIL: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)ను మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే సెయిల్‌లో విలీనం చేస్తే తప్పదన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగానూ, నిర్వహణా పరంగానూ నష్టాలను చవిచూస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా సెయిల్‌లో విలీనం చేస్తే మంచిదని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  విలీనం గనుక జరిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణను సెయిల్ నిర్వహిస్తుంది. అలాగే అప్పుల నుంచి బయట పడేసేందుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రుణాల చెల్లింపు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను విక్రయించే ఆలోచన కూడా కేంద్రం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్‌ఎండిసికి భూమిని విక్రయించడం, బ్యాంకు రుణాలు వంటి ఇతర అవకాశాలను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్ర అధికారులు సమావేశమయ్యారు.


కార్మికుల ఆందోళన
కొన్నాళ్లుగా నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంత గనులు లేకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టపోతున్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ట్రేడ్ యూనియన్లు కూడా సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం సెయిల్ విలీనాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ ప్లాంట్‌కు పెద్ద మొత్తంలో రుణాలు అందించడం, పెల్లెట్ ప్లాంట్ కోసం ఎన్ఎండీసీకి 1,500 నుంచి 2,000 ఎకరాల భూమిని విక్రయించే ఆలోచన కూడా ఉన్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. కనీస సామర్థ్యంతో పనిచేయడం వల్లే నష్టాలు పెరిగాయన్న అంచనాకు కేంద్రం వచ్చింది. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బదులుగా విలీనం ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెయిల్‌లు రెండూ కూడా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నాయి. 


విశాఖ ప్లాంట్ కు రూ.2500కోట్లు
మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచేందుకు రూ.2500 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముడిసరుకు కొరత కారణంగా స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి తగ్గిపోయింది. ముడిసరుకు కొరత కారణంగా ఉక్కు కర్మాగారంలోని రెండు ఫర్నేసుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కొలిమిలను పునఃప్రారంభించేందుకు కేంద్రం నిధులు కేటాయించింది. ఫర్నేసుల్లో ఉత్పత్తి నవంబర్ నాటికి ప్రారంభించాలి. ముడిసరుకు కూడా సరఫరా అవుతుంది. అలాగే కేటాయించిన నిధుల వినియోగం బాధ్యతను ఎస్‌బీఐకి అప్పగించారు. ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో కొంత మంది సిబ్బందిని ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు డిప్యూటేషన్‌పై పంపాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


Also Read: Kunki Elephants MOU: ఏపీ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం - ఎర్ర చందనం స్మగ్లింగ్ నియంత్రణపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు