AP And Karnataka Agreement On Kunki Elephants: ఏపీ - కర్ణాటక రాష్ట్రాల మధ్య కుంకీ ఏనుగుల (Kunki Elephants) అంశంపై శుక్రవారం కీలక ఒప్పందం జరిగింది. కర్ణాటక (Karnataka) నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపేలా  ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఈ కీలక ఒప్పందం జరిగింది. కాగా, చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల బెంగుళూరు వెళ్లిన పవన్.. కర్ణాటక మంత్రి, అక్కడి అటవీ అధికారులతో మాట్లాడి కుంకీ ఏనుగులను పంపాలని ప్రతిపాదించగా అందుకు వారు సానుకూలంగా స్పందించారు. 'ఏనుగులు పంట పొలాలు ధ్వంసం చెయ్యడం నా దృష్టికి వచ్చింది. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకోగానే ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని అధికారులతో సమీక్షించా. ఈ క్రమంలోనే కుంకీ ఏనుగులు తేవాలని నిర్ణయించాం. కర్ణాటక సీఎం, అటవీ శాఖ మంత్రిని కలిసి సమస్యను చెప్పిన వెంటనే వారు సానుకూలంగా స్పందించారు. ఇరు ప్రభుత్వాలు 6 అంశాలు మీద నిర్ణయం తీసుకున్నాం. దసరా  తరువాత కుంకి ఏనుగులను ఇక్కడికు తరలిస్తారు.' అని పవన్ తెలిపారు.






ఎర్ర చందనం స్మగ్లింగ్ నియంత్రణపై..


ఏపీలో ప్రస్తుతం 23 శాతం అటవీ ప్రాంతం ఉందని.. ఇది 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రస్తుతం అటవీ శాఖ క్యాంపులో ఉన్న ఏనుగులు వయసు మీరిన కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అందుకే కుంకీ ఏనుగులు పంపాలని కర్ణాటకను కోరామన్నారు. వీటి ద్వారా చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఏనుగుల దాడుల సమస్యను అరికట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. 'ఇరురాష్ట్రాలు ఒప్పందం చేసుకుని ఒక టీంగా ఏర్పడి ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టాలని నిర్ణయించుకున్నాం. కర్ణాటకలో ఎకో టూరిజం మాదిరిగా ఏపీలోనూ ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం. అటవీ అంశాలతో పాటు రాష్ట్రాల మధ్య సరిహద్దు సవాళ్లు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవాలి. అటవీ సంరక్షణలో కర్ణాటక ఐటీని కూడా విస్తృతంగా వినియోగిస్తోంది. సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందించేలా ఇరు రాష్ట్రాలు పని చేయాల్సి ఉంటుంది.' అని పవన్ పేర్కొన్నారు.


Also Read: YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న