హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్‌ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరగా హైదరాబాద్‌ సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. కుటుంబసభ్యులతో కలిసి యూరప్‌ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీఎం జగన్ ఏప్రిల్ 10న సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే పిటీషన్ పై సీబీఐ అధికారులు సైతం ఈ 17న కౌంటర్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు ఏప్రిల్ 21 నుంచి 29వ తేదీ వరకు యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. సీఎం జగన్ తన ఈమెయిల్ ఐడీ, మొబైల్ ఫోన్, విదేశీ పర్యటన వివరాలు సీబీఐ అధికారులకు ఇవ్వాలని కోర్టు జగన్ ను ఆదేశించింది. 


ఏపీ సీఎం  జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు యూరప్ పర్యటనకు వెళ్లాలనుకున్నారు. అందు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు పర్యటన రద్దయిందనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో మారుతున్న పరిణామాలతో తాను విదేశీ పర్యటనకు వెళ్లడం కరెక్ట్ కాదన్న అభిప్రాయంలో సీఎం జగన్ ఉన్నారంటున్నారు. షెడ్యూల్ ప్రకారం 21వ తేదీన  లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ పర్యటన రద్దు చేసుకున్నాక యూరప్ టూర్ కు వెళ్లేందుకు సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నుంచి అనుమతి లభించింది.


సీఎం జగన్ విదేశీ పర్యటన రద్దు! 
సీఎం జగన్ ఈ శుక్రవారం లండన్ వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు ఏపీ సీఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర కార్యదర్శుల సమావేశానికి బుధవారం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్న ఏపీ ప్రభుత్వ టీమ్ తో పాటు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారని తెలుస్తోంది. ఈ కారణాలతో సీఎం జగన్ యూరప్ పర్యటన కూడా వాయిదా వేసుకున్నారని సీఎస్ వెల్లడించారు. సీఎం ఢిల్లీ పర్యటన పై మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, వాటిని నమ్మవద్దని జవహర్ రెడ్డి అన్నారు.