Cases against Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ పూర్తి స్థాయి  దర్యాప్తు జరిపినట్లుగా తెలుస్తోంది. పలు గ్రామాలతో పాటు పోలవరం కట్టలపైనా ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరిగాయి. వీటిని ఎవరు తవ్వారన్నదానిపై విజిలెన్స్అధికారులు ఆరా తీశారు. ప్రతీ దశలోనూ వల్లభనేని వంశీ పేరే ఎక్కువ మంది చెప్పినట్లుగా తెలుస్తోంది. 


డ్రైవర్లు, ఇతర పని వాళ్ల పేరుతో లైసెన్స్‌లు


కొండపావులూరు గ్రామంలో మట్టి తవ్వకానికి ఓ వైసీపీ నేత వద్ద పని చేసే డ్రైవర్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. అయితే అనుమతించిన దాని కంటే కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఎక్కువ తవ్వేశారు. బాపులపాడు మండలంలో రెండు ఎకరాల్లో మట్టి తవ్వకానికి మాజీ ఎమ్మెల్యే పీఏకు సన్నిహితుడైన వ్యక్తి పేరుపై అనుమతులు తీసుకున్నారు. అనుమతి తీసుకున్న ప్రాంతంలో కాక ఇతర ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. పలు గ్రామాల్లో అనుమతులు  లేకుండానే తవ్వకాలు చేశారు.         


Also Read: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?


విజిలెన్స్  విచారణలో అనుమతులు తీసుకున్న వారు బినామీలుగా గుర్తింపు


ఈ తవ్వకాలపై విజిలెన్స్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. ఇందులో భాగంగా అనుమతులు తీసుకున్న వారిని విచారణకు పిలిపించారు.  వారిలో చాలా మంది అసలు తమకు మట్టి తవ్వకాల వ్యాాపారమే లేదని జీతం కోసం పని చేస్తున్నామని చెప్పారు. తమ ఆధార్ కార్డులు అడిగితే ఇచ్చామని అంతకు మించి తమకేమీ తెలియదని చెప్పారు. వారు ఆధార్ కార్డులు ఎవరికి ఇచ్చారో అనుమతులు తీసుకుని ఎవరు తవ్వకాలు చేశారో వివరాలన్నీ సేకరించారు. 


అంతా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టే !


గన్నవరం నియోజకవర్గంలో మట్టి తవ్వకాలపై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విజిలెన్స్ విచారణలో కనీసం రూ. వంద కోట్ల  విలువైన మట్టిని అనుమతుల్లేకుండా తవ్వేసినట్లుగా గుర్తించారు. ఇప్పటికే నివేదిక తయారు అయిందని ప్రభుత్వానికి సమర్పించడమే మిగిలిదంని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం చూస్తే.. రూ. వెయ్యి కోట్ల వరకు జరిమానా విధిస్తారు. క్రిమినల్ కేసులు పెడతారు. ప్రభుత్వానికి వెళ్లే నివేదికలో మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ఆయన తరపున దందా చేసిన ప్రధాన అనుచరుల పేర్లు ఉండే అవకాశం ఉంది. 


Also Read: అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే


కేసును సీఐడీకి అప్పగించే అవకాశం


ఒక్క గన్నవరం నియోజకవర్గంలోనే కాకుండా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఈ మట్టి తవ్వాకల స్కాం ఉండటంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓడిపోయిన తర్వాత పెద్దగా నియోజకవర్గంలోని కనిపించని వల్లభనేని వంశీ కోర్టు వాయిదాలకే వస్తున్నారు. ఆయనపై మరిన్ని కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.