AP CAG: ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా తీసుకు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సరికాదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) పేర్కొంది. 2020-21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన నివేదికలను సమర్పించిన కాగ్.. వార్డు కమిటీలు లేకుండా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తన ఆడిట్ రిపోర్టులో వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థల ఏర్పాటు పాలన వికేంద్రీకరణ కోసమే అని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
2019 జులైలో ఈ వ్యవస్థను ఏపీ రాష్ట్ర సర్కారు తీసుకువచ్చింది. అయితే ఈ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించిందని కాగ్ తెలిపింది. క్షేత్రస్థాయిలో ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేయడం అంటే స్థానిక స్వపరిపాలనను దెబ్బతీయడమే అని పేర్కొంది. స్వపరిపాలన సాధనకు ప్రజా ప్రతినిధులతో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని కాగ్ సూచనలు చేసింది.
2019 ఫిబ్రవరి నుంచి అమరావతికి బడ్జెట్ తోడ్పాటు అందించలేదని కాగ్ తన 2020-21 రిపోర్టులో పేర్కొంది. నగర అభివృద్ధి నిధులకు రుణాల సేకరణే ప్రధాన వనరుగా నిర్ణయించినట్లు కాగ్ గుర్తు చేసింది. అమరావతి అభివృద్ధికి రూ. 33,476 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఏపీ సీఆర్డీఏ రూ. 8,540 కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు తెలిపింది. రాజధాని నగర అభివృద్ధిపై విధాన మార్పుల వల్ల 2019 మే నుంచి అభివృద్ధి ప్రణాళికలో అనిశ్చితి నెలకొన్నట్లు పేర్కొంది. 55 ప్యాకేజీల పూర్తికి రూ. 28,047 కోట్లు అవసరమని కాగ్ తెలిపింది. అమరావతిలో భూ సమీకరణకు రూ. 2,244 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తు చేసింది. సమీకరించిన భూమి అభివృద్ధి లేకుండా నిరుపయోగంగా ఉన్నట్లు చెప్పింది. దీని వల్ల ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లక్ష్యం నెరవేరలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో పేర్కొంది.
అమరావతి ప్రాంతంలో పనులు ఆపేయడం వల్ల నిధులు నిరుపయోగంగా ఉండిపోయాయని ప్రభుత్వ తీరును కాగ్ తప్పు బట్టింది. 2019 మే నెల నుంచి వివిధ పనులను నిలిపి వేశారన్న కాగ్ రిపోర్టు.. దీని వల్ల ఈ పనుల కోసం ఖర్చు చేసిన రూ.1505 కోట్లు నిరుపయోగం అయ్యాయని తెలిపింది. జలవనరుల పరిధిలో ప్రజా వేదికను నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా కట్టారని.. ఆ తర్వాత దానిని కూల్చి వేయడం వల్ల రూ. 11.51 కోట్ల ప్రజాధనం వృథా అయిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రూ. 13,802 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదన ఉండగా.. దీనిలో 2021 నాటికి కేవలం రూ. 183 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు కాగ్ గుర్తించింది.
విశాఖలో 876 పరిశ్రమల్లో 70 పరిశ్రమలు సరైన అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు కాగ్ తన రిపోర్టులో తెలిపింది. 2016 - 2021 మధ్య పలు అవకతవకలు జరిగినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2015-20 మధ్య కాలంలో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర గ్రాంట్లలో 129 కోట్ల తగ్గుదల.. 2016-18 మధ్య కాలంలో పని తీరు గ్రాంటులో 28.93 కోట్లకు కోత పడిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన నివేదికలో తెలిపింది.