కెనడా, భారత్‌ల మధ్య ఖలిస్థానీ అంశంతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కొత్త విషయం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌ డల్లాకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో ఉంటున్న హిందూ నాయకులపై దాడులు చేయాలని అర్ష్‌దీప్‌ కుట్రలు చేస్తున్నట్లు దిల్లీ పోలీసులు గుర్తించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య వివాదాలు తీవ్ర రూపం దాల్చిన ఈ సమయంలో ఈ విషయం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 


 హిందూ నేతలు, ఆరెస్సెస్‌ నాయకులపై దాడలు జరిపేందుకు ఖలిస్థానీ ఉగ్రవాదుల ప్రణాళికలు రచించినట్లు దిల్లీ పోలీసులు ఈ ఏడాది ఆరంభంలో ఇద్దరు ఉగ్రవాద అనుమానిత వ్యక్తులపై చేసిన దాడుల సమయంలో గుర్తించినట్లు సమాచారం. జనవరిలో దిల్లీలోని జహంగీర్‌పురిలో పోలీసులు జరిపిన దాడుల్లో జగ్జీత్‌ సింగ్‌ జగ్గా, నౌషద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం కింద అభియోగాలు మోపారు. అర్ష్‌దీప్‌ దల్లాతో తనకు సంబంధాలు ఉన్నట్లు విచారణలో జగ్గా అనే ఉగ్రవాది వెల్లడించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో ఉగ్రదాడులకు సిద్ధం కావాలని కెనడాలో ఉంటున్న అర్ష్‌దీప్‌ గ్యాంగ్‌ జగ్గాను అడిగినట్లు పంజాబ్‌ పోలీసులు ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్‌షీటులో పేర్కొన్నారు. 


ఇంకా ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సుహైల్‌, దల్లాల నుంచి వస్తున్న సూచనల మేరకు తాము జహంగీర్‌పురిలో ఓ హిందూ బాలుడిని హత్య చేసినట్లు విచారణలో జగ్గా అంగీకరించినట్లు తెలిపారు. దానికి సంబంధించిన వీడియోను కూడా రికార్డు చేసి సుహైల్‌, దల్లాలకు పంపినట్లు నౌషద్‌, జగ్గా చెప్పారని, ఇందుకోసం వారి నుంచి రూ.2లక్షలు అందినట్లు చెప్పారని పేర్కొన్నారు. అర్ష్‌ దల్లా సూచనలతో పాటు, లష్కరే తోయిబా సూచనల ప్రకారం కూడా పంజాబ్‌ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో దాడులు చేయాలని చెప్పారని ఛార్జ్‌షీట్‌లో రాశారు. 


అర్ష్ దీప్ దల్లా ఎవరు?


ఇంతకీ ఈ అర్ష్‌దీప్‌ ఎవరంటే.. ఇతడిది పంజాబ్‌లోని మోఘా జిల్లా స్వస్థలం. 27ఏళ్ల దల్లాపై భారత్‌లో కనీసం 20 కేసులున్నాయి. 2020 జులైలో అతడు అక్రమంగా కెనడా పారిపోయినట్లు నిఘా వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే ఇతడు కెనడా ఉంటున్న ఖలిస్థానీ మద్దతుదారుల్లో ఒకడు అని భారత నిఘా వర్గాలు చెప్తున్నాయి. హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ నిజ్జర్‌కు సన్నిహితుడు. ఇప్పుడు దల్లా కెనడాలో గ్యాంగ్‌స్టర్‌. ఇటీవల దల్లా గ్యాంగ్ కు చెందిన సుఖ్‌దోల్‌ సింగ్‌ కెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు.


భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకంటే..?


ఈ ఏడాది జూన్‌లో కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా, భారత్‌ల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారతీయ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని తమకు విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ ఆరోపించారు. దీనిపై భారత్‌ మండిపడింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఖలిస్థాన్‌ వేర్పాటు వాదులు కెనడా నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని భారత్‌ ఆరోపణలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలు రాయబారులను బహిష్కరించాయి. కెనడా పౌరులకు వీసాల జారీని కూడా భారత ప్రభుత్వం నిలిపేసింది. కెనడా ఇప్పటికీ ప్రభుత్వం తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు.