వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై కామెంట్స్ చేశారని.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పురంధేశ్వరి స్పందించారు. అలాంటి మాటలు మాట్లాడం సరికాదన్నారు. ఈ విషయంపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎంతో విలువతో పెరిగిన మమ్మల్ని ఇలా అనడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి వారిని ప్రొత్సహించొద్దు: సుజనా చౌదరి
ఈ విషయంపై రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. అసెంబ్లీలో కొందరు విపక్ష నేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి.. ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. సభా నాయకుడైన ముఖ్యమంత్రి ఇలాంటి వారిని ప్రోత్సహించడం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలు విధానాలపై వుండాలి.. కానీ ప్రస్తుతం వ్యక్తులను దాటి, కుటుంబం వరకు వెళ్లిందని విమర్శించారు. ఇది సరైన విధానం కాదన్నారు. ఏ పార్టీ వారైనా హద్దులు దాటి, అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం అత్యున్నత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక విలువలను పతనం చేయడమేనని సుజనా వ్యాఖ్యానించారు.
ఉన్నత విలువలతో, సంస్కారవంతమైన భాషతో ప్రజా సమస్యలపై చర్చలకు వేదికగా నిలవాల్సిన చోట ఇలాంటి పరిణామాలు జరగడం శోచనీయం. రాష్ట్రంలోని మేధావులు, విద్యావంతులు, వివేచన కలిగినవారంతా ఇలాంటి ఘటనలను ఖండించాలి. వ్యక్తిత్వం లేని నేలబారు నేతలను చట్టసభలకు పంపితే పరిణామాలు ఇలానే వుంటాయి. మన పిల్లల కోసం మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే దిగజారుడు నేతలను దూరం పెట్టాలి. లేదంటే భవిష్యత్తు తరాలు రాజకీయనాయకులన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా అసహ్యించుకునే ప్రమాదం వుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా నేతలంతా రాజకీయాల్లో విలువలను కాపాడేందుకు ప్రయత్నించాలని కోరుతున్నాను.
- సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు
కుటుంబ సభ్యులపై కామెంట్స్ చేయడమేంటి: పవన్
తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని ప్రతిపక్ష నేత చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరమని జనసేన అధినేత పవన్ అన్నారు. ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమన్నారు. ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లోని వ్యక్తులు మరింత జాగ్రత్త వహించాలన్నారు. మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్ఠలకు హాని కలిగించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు.
ఈ తరహా దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇదే తరహా కొనసాగితే ఇది ఒక అంటు వ్యాధిలా అంతటా ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలే సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగిస్తుందని చెప్పారు. ఇటీవల సభలు, సమావేశాలు, చివరికి టీవీ చర్చలలో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంటోందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
Also Read: AP Chandra Babu : మళ్లీ గెలిచాకే అసెంబ్లీకి వెళ్తా.. కుటుంబాన్ని అవమానించారని విలపించిన చంద్రబాబు !