PM Modi In Bhimavaram : స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని ప్రధాని మోదీ కలిశారు. ఆ సమరయోధుడి కుమార్తె 90 ఏళ్ల పసల కృష్ణ భారతికి మోదీ పాదాభివందనం చేశారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె సోదరి, మేనకోడలు వద్ద నుంచి కూడా ప్రధాని ఆశీర్వదాలు తీసుకున్నారు.
ప్రధాని పాదాభివందనం
ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో అరుదైన ఘటన జరిగింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులైన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి కుటుంబసభ్యులను ప్రధాని కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ వీర దంపతుల కుమార్తె పసల కృష్ణభారతికి ప్రధాని మోదీ పాదాభివందనం చేశారు. 90 ఏళ్ల వయసు గల కృష్ణభారతి వీల్ ఛైర్‌లో ఉండగా ప్రధాని ఆమె పాదాలను తాకి నమస్కరించారు. పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు జాతిపిత గాంధీని అనుసరించారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు.
స్వాతంత్య్ర పోరాట యోధులు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలోని వెస్ట్ విప్పర్రు గ్రామంలో 1900లో జన్మించారు పసల కృష్ణమూర్తి. 1904లో తణుకు తాలూకా కుముదవల్లిలో మునసబు కుటుంబంలో జన్మించారు అంజలక్ష్మి. 1916లో వీరిద్దరికీ పెళ్లైంది. కృష్ణమూర్తి 1921లో భార్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1921లో గాంధీజీ విజయవాడ, ఏలూరు పర్యటన కృష్ణమూర్తి దంపతుల జీవితాల్ని మార్చేసింది. గాంధీజీ సమక్షంలో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేసి స్వాతంత్య్ర పోరాటంలోకి దూకారు. 1929 ఏప్రిల్ 25న చాగల్లు ఆనంద నికేతన్‌కు వచ్చిన గాంధీజీని కలిసి ఖద్దరు నిధికి తమ బంగారు ఆభరణాలన్నింటినీ దానం ఇచ్చేశారు. వెంట వచ్చిన ఆరేళ్ల కుమార్తె సత్యవతి, నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణ కూడా తమ ఆభరణాలను ఖద్దరు నిధికి ఇచ్చేశారు. గాంధేయవాది అయిన కృష్ణమూర్తి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించారు. పసల కృష్ణమూర్తి 1978లో కన్నుమూశారు.
Also Read : Chiru Modi Bonding : మోదీ ఆత్మీయతకు చిరంజీవి ఫిదా ! రాజకీయం మారే చాన్స్ ఉందా ?
Alsor Read : Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు