మానవాళికి ధర్మమార్గాన్ని అలవాటు చేసేందుకు సంత్ సేవాలాల్ మహారాజ్ అహరహమూ శ్రమించారు. తనదైన శైలి బోధనలతో బంజారాల మనసు గెలుచుకుని.. వారిని భాషపరంగా ఏకతాటిపైకి తెచ్చి.. ధర్మమార్గంలో నడిచేలా చేశారు. ప్రకృతిని, వన్యజీవులను కాపాడుకుంటూ.. తల్లిదండ్రులు, మహిళలను గౌరవిస్తూ జీవించాలన్నది ఆయన ప్రవచనాల్లో అత్యంత కీలకమైనది.
సేవాలాల్ బాల్యం
సంత్ సేవాలాల్ మహారాజ్.. 1739వ సంవత్సరం ఫిబ్రవరి 15న, అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి దగ్గరున్న సేవాగఢ్‌లో జన్మించారన్నది బంజారాల విశ్వాసం. ఆయన గొప్ప సంఘ సంస్కరణవాది. ఆధ్యాత్మిక గురువు. జగదంబకు అత్యంత ప్రియ భక్తుడు. ఆజన్మ బ్రహ్మచారి అయిన సేవాలాల్.. విశిష్ట బోధనలతో యశస్సును పొందారు. ఆయన్ను అసంఖ్యాక భక్తులు అనుసరించేవారు.
బంజారాల దేవుడు
బంజారాల హక్కులు, నిజామ్, మైసూరు పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా.. 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్ సేవాలాల్ కీలక భూమిక పోషించారు. ఆంగ్లేయులు, ముస్లిం పాలకుల ప్రభావాలకు లోను కాకుండా, ఇతర సంప్రదాయాల్లోకి బంజారాలు మారకుండా సేవాలాల్ ఎంతగానో కృషి చేశారు. తద్వారా బంజారాలకు ఆయన ఆరాధ్య దైవమయ్యాడు. లిపిలేని బంజారాల భాషకు ఒక రీతిని సమకూర్చింది కూడా సేవాలాల్ మహారాజే. కోట్లాదిగా బంజారాలు... స్థిర నివాసం లేకున్నా తమ కట్టుబాట్లు , ఆచారవ్యవహారాలు, విలక్షణమైన దుస్తులు, ఆభరణాలతో బంజారాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ.. ఒకేరకమైన భాషను మాట్లాడగలుగుతున్నారంటే అది సంత్ సేవాలాల్ కృషి ఫలితమే.
రెండు జెండాల ఆంతర్యం
బంజారాల్లో అత్యధికులు సప్త మాతృకల పూజావిధిని అనుసరిస్తారు. వీరు సేవాలాల్ ఆరాధ్యదైవం జగదంబతోపాటు, సేవాలాల్ విగ్రహానికీ పూజలు చేస్తారు. ఆలయం ముంగిట్లో రెండు జెండాలుంటాయి. ఒకటి తెల్లది.. మరోటి ఎరుపు వర్ణంలోనిది. తెలుపు వర్ణం సేవాలాల్‌కు శాకాహారాన్ని నివేదించమని, ఎరుపు వర్ణం జగదంబకు మాంసాహారాన్ని నివేదించమని సూచిస్తాయని బంజారాలు నమ్ముతారు. నిజానికి సేవాలాల్ విగ్రహారాధన, మూఢనమ్మకాలు, జంతుబలులకు వ్యతిరేకి కావడం విశేషం.
బంకమట్టితో రొట్టెలు!
ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టాలనేది సంత్ సేవాలాల్ కీలకమైన ప్రబోధం. చిన్నతనంలో పశువులను కాసేందుకు వెళ్లిన సేవాలాల్, తన తల్లి కట్టి ఇచ్చిన ఆహారాన్ని ఇతరులకు పంచి, తాను అక్కడున్న బంకమట్టితో రొట్టెలు చేసుకుని తినేవాడని బంజారాలు నమ్ముతారు. అందుకే.. దీనికి గుర్తుగా, కొందరు బంజారాలు ఇప్పటికీ బంకమట్టితో చేసిన పదార్థం సిరాను సేవాలాల్‌కు నివేదిస్తుంటారు. జంతుబలిని సేవాలాల్ బలంగా వ్యతిరేకించేవాడు. ఈ క్రమంలో జగదంబ కరుణకు పాత్రుడై.. మానవుల్లో పెరుగుతున్న అహింస, దురలవాట్లకు వ్యతిరేకంగా బంజారాలను నడిపించాడు.
బంజారాలా సేవా పోలీస్
అస్పృశ్యత, వివక్షతలకు దూరంగా హూందాగా జీవించడం, భయాందోళనలకు గురికాకుండా ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో జీవించాలి, నిరుపేదలు, ఆకొన్నవారికి ఆహారాన్ని సమకూర్చాలి. అనైతిక విలువలు, అనైతిక సంబంధాలకు దూరంగా ఉండాలి.. ఇలాంటి సుమారు 22 కీలకమైన సేవాలాల్ ప్రవచనాలను బంజారాలు సేవా పోలీస్ గా పిలుచుకుంటారు.
సంత్ సేవాలాల్ మహారాజ్... 1806వ సంవత్సరం, డిసెంబర్ నాలుగో తేదీన.. మహారాష్ట్రలోని రూహియాగఢ్‌లో పరమాత్మలో లీనమయ్యారు. సామాన్య మానవుడిగా పుట్టి.. తన ధర్మపరిరక్షణ రీతులతో సంత్ సేవాలాల్.. ధర్మనిరతి, మానవ జాతి పరిరక్షణ మార్గంలో దైవత్వాన్ని పొందారు.
ప్రతి ఏటా ఆయన జయంతి ఉత్సవాలు గుత్తి మండలం లోని చెర్లోపల్లి గ్రామం వద్ద సేవగడ్‌లో అత్యంత వైభవంగా జరుగుతాయి. విశిష్ట పూజలతోపాటు 101 మంది కన్నెలతో నిర్వహించే తేజ్ కార్యక్రమం ముఖ్యమైనది. అలాగే జయంతి ఉత్సవాల్లో చివరిగా మహాబోగ్ కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలకు శుభం పలుకుతారు.